సత్యవతి అనే 65 ఏళ్ల వృద్ధురాలు కూలీపని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త గుండెపోటుతో కన్నుమూసిన భాధ నుంచి బయటపడకముందే... కుమారుడిని లారీ ఢీకొట్టింది. అండగా ఉంటాడనుకున్న కొడుకు... కాళ్లు చేతులు విరిగి 8 నెలలుగా మంచాన పడ్డాడు. కుమారుణ్ణి చూసుకోవాల్సిన కోడలు... పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడికి సేవలు చేస్తూనే కూలికి వెళ్తోంది సత్యవతి. వేసవి కావడంతో ఆమెకు ఆరోగ్యం సహకరించక పనికి వెళ్లలేకపోతుంది. న్యాయం చేయాలంటూ అర్బన్ ఎస్పీ వై.టి నాయుడును వేడుకుంది.
గుంటూరు నగర శివారు దాసరిపాలెం గ్రామానికి చెందిన సత్యవతి-సూర్యచంద్రరావు దంపతులకు ఆరుగురు సంతానం. వారిద్దరూ కూలి పనులు చేసి... నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను ప్రయోజకుల్ని చేశారు. కానీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తన కొడుకుని చూసుకోవాల్సిన కోడలు... భర్తను వదిలేసి... పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లి పోయిందని వాపోయింది. తన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిదిమేసిందని కన్నీరు పెట్టుకుంది. కొడుకును చూసుకోవడం... ఇళ్లు గడవడం కష్టంగా ఉందని కన్నీటి పర్యంతమైంది ఆ తల్లి.
తన కొడుకు నాగరాజు స్థితికి కారణమైన రోడ్డు ప్రమాద నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితున్ని పట్టుకొమని పోలీసులు చుట్టూ తిరుగుతుంటే... నిందితుడు పరారీలో ఉన్నాడని... తమని ఏం చేయమంటారని పోలీసులు విసింగించుకుంటున్నారని వాపోయింది. పోలీసులు ఇప్పటికైనా స్పందించి... తమ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధితుడి తల్లి, సోదరి కోరుతున్నారు.