ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటునకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ నడిబొడ్డున భవనాలు, ఇళ్ల కొనుగోళ్లకు ఏర్పడిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని స్థిరాస్తి వ్యాపారులు రంగంలోకి దిగి సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బహుళ అంతస్తుల భవనాలకు ఏ మాత్రం అనుకూలంగా లేని ఇరుకు సందుల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో వాణిజ్య భవనాల నిర్మాణం చేపట్టారు. అక్రమ నిర్మాణాలకు ఆరంభంలోనే అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటనతో బాపట్లలో నిర్మాణాలు ఊపందుకున్నాయి. వ్యాపారులు స్థలాలు కొనుగోలు చేసి అపార్ట్‌మెంట్లు నిర్మించే సమయంలోనే రెండు, మూడు పడక గదుల ఇళ్ల ప్లాట్లను రూ.50 లక్షల నుంచి 70 లక్షల వరకు విక్రయిస్తున్నారు. పట్టణ నడిబొడ్డున నిర్మిస్తున్న కట్టడాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కొందరు వ్యాపారులు వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో భవనాల నిర్మాణ ప్లాన్‌ను సమర్పించి ఫీజు చెల్లించి అనుమతులు తీసుకుంటున్నారు. గతంలో అనుమతి తీసుకున్న తర్వాత పట్టణ ప్రణాళిక అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని నిబంధన అమలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆ నిబంధన ఎత్తివేసింది. ఒకసారి అనుమతి వచ్చిన తర్వాత వెంటనే నిర్మాణాలు చేపట్టటానికి పచ్చజెండా ఊపింది. అధికారులు తర్వాత వెళ్లి తనిఖీ చేసి అనుమతి తీసుకున్న భవన ప్రణాళిక మేరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలన చేస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..
పట్టణ ప్రణాళిక నిబంధనలు సరళతరం చేసి అనుమతులు పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఇవ్వడం ద్వారా అవినీతిని అరికట్టాలన్న ఉద్ధేశం ప్రభుత్వం ఏ మాత్రం నెరవేరడం లేదు. బాపట్ల పురపాలక సంఘం విజయలక్ష్మీపురంలో ఓ వ్యాపారి మూడు అంతస్థుల కట్టడం నిర్మిస్తున్నాడు. నివాస ప్రాంతంలో భవనం నిర్మించడానికి అనుమతి తీసుకుని కింద వాణిజ్య విభాగం పరిధిలోకి వచ్చే గోదాములు, దుకాణాల నిర్మాణం చేపట్టాడు. మాస్టర్‌ప్లాన్ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో వాణిజ్య కట్టడాలు నిర్మించరాదు. అయినా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు చోద్యం చూస్తున్నారు.
పట్టణంలోని 19వ వార్డు స్వామి వివేకానందవీధిలో ఇరుకు సందులో సిల్ట్ జీ+2 బహుళఅంతస్థుల భవనం నిర్మాణానికి వ్యాపారులు అనుమతి సంపాదించారు. కేవలం పన్నెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న రోడ్డులో నిబంధనల ప్రకారం బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే సహాయక చర్యలు వేగంగా చేపట్టలేని పరిస్థితి ఉంటుంది.
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
జిల్లాలో పురపాలక సంఘాల్లో పట్టణ ప్రణాళిక అనుమతులు తీసుకుని చేపట్టిన భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించి వాటి వివరాలను ఫొటోలతో సహా అధికారులు యాప్‌లో అప్‌లోడ్ చేశారు. 12 పురపాలక సంఘాలు, గుంటూరు నగరంలో కలిపి ఇప్పటి వరకు మూడున్నర వేలకు పైగా భవన ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. ప్రతి పురపాలక సంఘంలో డ్రెయిన్లు ఆక్రమించి నిర్మించిన భవనాలు, మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్దేశిత పది అడుగుల స్థలం వదలకుండా నిర్మించినవి, సెట్ బ్యాక్‌ల ఉల్లంఘనలు ఎన్ని జరిగాయన్నా వివరాలు సేకరించి ధ్రువీకరిస్తున్నారు. ఈ వివరాలను పట్టణ ప్రణాళిక రాష్ట్ర సంచాలకుడికి పంపించి ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కమిషనర్లు భావిస్తున్నారు.. నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న భవనాల వివరాలు సేకరించామని పురపాలక కమిషనర్ భానుప్రతాప్ అన్నారు.. వీటిని యాప్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: