కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని.. కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్పర్సన్ బి. ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా.. సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రావిడెంట్ ఫండ్‌తో పాటు ఉద్యోగులకు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను.. ఈపీఎఫ్ ఉన్నతాధికారులు వివరించారు. పీఎఫ్ పొందే సమయంలో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కారాలకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో ఈపీఎఫ్ జోనల్ కార్యాలయం ఏర్పాటైందని భవిష్యనిధి అధికారులు తెలిపారు. గుంటూరు, కడప, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలో ప్రాంతీయ కార్యాలయాలు పని చేస్తున్నాయన్నారు. కొవిడ్ కాలంలో అత్యవసర విభాగం కింద కార్యకలాపాలు కొనసాగించామని స్పష్టం చేశారు. కార్మికుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులు ఉండటంతో వారికి భవిష్యనిధి ప్రయోజనాలు అందజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కమిటీకి సూచించారు. పీఎఫ్ ప్రయోజనాలు త్వరితగతిన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని.. ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు కోరారు. భవిష్యనిధి రుణాలు, పింఛన్లు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఛైర్ పర్సన్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:
ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు.. జాబితా ప్రకటించట్లేదు: సజ్జల