గుంటూరు జిల్లా కాకుమాను, వట్టి చెరుకూరు మండలాల్లో కురిసివ వర్షాలకు వరి పైరు చేతికొచ్చే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో పంట కోసి.. కుప్పలు వేశారు. నూర్పిడి చేయకపోవటంతో వరి బోదెలు పొలాల్లోనే ఉండిపోయాయి. మరి కొన్ని చోట్ల కోత కోసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. ఈ సమయంలో తుపాన్ ప్రభావంతో భారీగా వర్షాలు కురవడంతో పంట నీట మునిగింది. చేతికి అందివచ్చిన పంట నీటిపాలవటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడులతో పాటు కౌలు కూడా చెల్లించాల్సి రావటం వారికి పెనుభారం కానుంది.
"అసలే ధాన్యానికి ధర లేదు. దీనికి తోడు పంట నష్టం జరిగింది. పైరు మొత్తం నీటిలో మునిగి ధాన్యం తడిసిపోయింది. కనీస మద్దతు ధర లభిస్తుందన్న ఆశ కూడా లేదు. ఎకరానికి రూ.30 వేలు చొప్పున పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు మాకు మిగిలేది అప్పులే. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి" బాధిత రైతులు
ఈదురు గాలుల కారణంగా గుంటూరు-బాపట్ల మార్గంలో చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిపోవటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇదీ చదవండి: తుపాన్ ఎఫెక్ట్.. 70 వేల ఎకరాల్లో నీట మునిగిన పంట