తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన పడవ ప్రమాదంలో బాధితుల జాడ ఇంకా తెలియరాలేదు. 8 మృతదేహాలు లభ్యంకాగా... 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన 38 మంది ఆచూకీ కోసం... నేవీ, ఎన్డీఆర్ఎఫ్ , ఇతర దళాలు గోదావరిని జల్లెడ పడుతున్నాయి. ప్రత్యేకబృందాలతో గాలించినా...సోమవారం ఒక్కరి జాడా దొరకలేదు. ఉదయం 6 గంటలకే ప్రత్యేక బృందాలు, నేవీ దళాలు హెలికాప్టర్లూ వచ్చినా...తీవ్రవర్షం కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది.
ముమ్మర గాలింపు
బాధితుల ఆచూకీ కోసం విపత్తు నిర్వహణ-అగ్నిమాపక ఆరుబోట్లతో 80 మంది సిబ్బందితో గాలింపు చేపట్టాయి. రెండు ఎన్డీఆర్ఎఫ్ , ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఏడుగురు నేవీ డ్రైవర్లు, 80 కంట్రీబోట్లు...పోలీసుల సాయంతో గాలింపు చేపట్టారు. చమురుతెట్టు ఆధారంగా... బోటు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. 315 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. లోతైన నీటిలో వెతుకులాట కొనసాగించగల 30 మంది బృందం దేహ్రాదూన్ నుంచి తీసుకువచ్చారు. నేటి నుంచి వీరు సహాయక చర్యల్లో పాల్గొంటారు. కాపర్ డ్యామ్ వద్ద, ధవళేశ్వరం కాటన్‌బ్యారేజీ వద్ద గాలింపు చర్యలు చేపట్టారు.
సీఎం పరామర్శ
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిని సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, నేతలు సందర్శించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించారు. అనంతరం మార్చురీ వద్ద మృతదేహాలకు నివాళులర్పించారు. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు.
ఆసుపత్రి వద్ద పడిగాపులు
బాధితుల సమాచారం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. లెక్కల్లో గందరగోళంతో... బాధితుల కుటుంబసభ్యులు సమాచారం కోసం తీవ్రఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పష్టమైన సమాచారం అధికారులు ఇవ్వట్లేదని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. నిద్రాహారాలు మాని ఆసుపత్రి వద్దే పడిగాపులు కాస్తున్న వారిని అధికారులు సముదాయించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉన్న మృతదేహాలను ఆయా ప్రాంతాల తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు, కుటుంబసభ్యుల సమక్షంలో సొంత ప్రాంతాలకు తీసుకెళ్లారు.
బోటు యజమానిపై కేసు
ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటు యజమానులు కోడిగుట్ల వెంకటరమణ, యల్లా ప్రభావతి, యర్రంశెట్టి అచ్యుతమణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బోటు సర్వీసులన్నిటీనీ సీఎం రద్దు చేశారని, ఇది పునరావృతంగాకుండా చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు.
ఇదీచదవండి