తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శ్రీ రామరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఎట్టకేలకు పోలీసులు, దాతల కుటుంబసభ్యుల సమక్షంలో ప్రారంభించారు. 1947లో అనపర్తికి చెందిన ద్వారంపూడి రామరెడ్డి జిల్లా పరిషత్త్ ఉన్నత పాఠశాలకు 10.47 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. అయితే పాఠశాలకు తమ పూర్వీకులు ఇచ్చిన స్థలం ఆక్రమణకు గురి అవుతుందంటూ ఇటీవల దాతల కుటుంబ సభ్యులు కాలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దీనిలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశల భూమి సర్వే నిర్వహించిన అధికారులు రహదారి పాఠశాల స్థలంలో భాగమని తేల్చారు.
పాఠశల అభివృద్ధిలో భాగంగా ప్రహరీ గోడ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించి ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి రూ. 17.70 లక్షలు మంజూరు చేశారు. ఈ క్రమంలో పాఠశాలకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోని స్థానికులు గోడ నిర్మించేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు జోక్యంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గోడ నిర్మాణ పనులు ప్రారంభించారు.