రాజకీయాల్లో మార్పు అవసరం మంటూ పార్టీ స్థాపించి, ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి తీవ్ర పరాభవమే ఎదురైంది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ గాజువాకలో ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ ప్రస్తుతం రెండింట్ల వెనకబడ్డారు. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీలో ఉన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూడనున్నారు.
మాజీ సభాపతి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఫలితాల్లో వెనకబడ్డారు. గోదావరి జిల్లాలో సత్తా చాటుతుందనుకున్న జనసేన కేవలం రాజోలులో మాత్రమే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇక్కడి నుంచి రాపాక వరప్రసాద్ ముందంజలో ఉన్నారు. నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి నిలబడ్డ పవన్ సోదరుడు నాగేంద్ర బాబు కూడా వెనకబడ్డాడు.