Amaravati Farmers Maha padayatra: రాజధాని రైతుల మహాపాదయాత్ర.. ఆరో రోజూ ఉత్సాహంగా సాగింది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఐలవరం నుంచి ప్రారంభించి.. కనగాల, గూడవల్లి, రాజవోలు, తూర్పుపాలెం, నగరం వరకు దాదాపు 15కిలోమీటర్ల మేర సాగింది. కాస్త ఎండ తీవ్రత పెరిగినా రైతులు విశ్రమించకుండా జయహో అమరావతి అంటూ నినదించారు. పాదయాత్ర నుంచి ప్రజలు దృష్టిమళ్లించడంతోపాటు.. అమరావతి అభివృద్ధిపై మరింత కాలయాపన కోసమే ప్రభుత్వం.. ఆర్నెళ్లు గడిచిన తర్వాత.. హైకోర్టు తీర్పును సుప్రీంలో.. సవాల్ చేసిందన్నారు. అమరావతిపై ఎన్నో కేసులు వేసి ఎదురుదెబ్బలు తిన్న వైకాపా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ అదే పునరావృతమవుతుందని స్పష్టంచేశారు.
"హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 197 రోజులపాటు వేచి ఉండి.. ఈ రోజు సుప్రీం కోర్టుకు వెళ్లడం చూస్తుంటే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయటానికి కుట్ర పన్నుతున్నారు. ప్రభుత్వ వాదనలో చిత్తశుద్ధి లేదు. మీరు రాజధాని విషయంలో చేస్తున్న ప్రతి చర్య.. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల గుండెలపై తన్నినట్లుగా ఉన్నాయి". -పువ్వాడ సుధాకర్, అమరావతి ఐకాస నేత
అమరావతి రైతుల పాదయాత్రకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. న్యాయపోరాటంలో రైతులతే అంతిమ విజయమన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో.. పాదయాత్ర సాగిన మార్గాల్లోని గ్రామాలు మమేకం అయ్యాయి. ఐలవరం గ్రామస్థులు చంటిబిడ్డలను ఎత్తుకునివచ్చి మరీ.. రైతులతో కలిసి నడిచారు. కనగాల, గూడవల్లి గ్రామాల ప్రజలు పొలిమేర దాటేవరకూ పాదయాత్రలో పాల్గొన్నారు. రాజవోలులో భోజనవిరామం తీసుకున్న రైతులు అక్కడ నుంచి తూర్పుపాలెం మీదుగా నగరం చేరారు.
"రైతులకు సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఒకే రాజధాని కావాలని మేమందరం కోరుకుంటున్నాం. కోర్టు తీర్పుల ప్రకారం న్యాయం జరుగుతుంది".-గూడవల్లి గ్రామస్థులు
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సహా వివిధ పార్టీల నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంక్షేమమండలి ఛైర్మన్ వల్లూరు జయప్రకాశ్ ఆధ్వర్యంలో పలువురు భాజపానేతలు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా.. రైతులు నడిచే మార్గాన్ని చీపుర్లతో ఊడ్చారు. ప్రధాని మోదీకి రైతుల తరఫున పోస్టుకార్డులు పంపారు.
పాదయాత్ర మార్గంలోని గూడవల్లి వద్ద స్థానిక వైకాపా నేతలు 3రాజధానులు కావాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇలా చేస్తున్నారని పాదయాత్రలో పాల్గొన్న జనసేన నేతలు విమర్శించారు. ఆదివారం నగరం నుంచి ప్రారంభం కానున్న రైతుల ఏడోరోజు మహాపాదయాత్ర రేపల్లె వరకూ సాగనుంది.
ఇవీ చదవండి: