వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేపాక్షి నాలెడ్జ్ లాంటి పరిశ్రమలను పక్కదారి పట్టిస్తే... ఇప్పుడు తన పాలనలో కియా లాంటి పరిశ్రమలను తరలి వెళ్లేలా.. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని మాజీ మంత్రులు, అనంతపురం జిల్లా తెదేపా నేతలు మండిపడ్డారు. తెదేపా నేతల బృందం చిలమత్తూరులోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను, పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప స్థానిక రైతులతో కలసి చర్చించారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కింద భూములు కోల్పోయిన రైతులను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కియా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పరిశ్రమ ఎక్కడికీ పోనివ్వమని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు పాలనకు కియా తలమానికం
వైకాపా దురంహకార చర్యల వల్లే పరిశ్రమల యజమాన్యాలు భయపడే పరిస్థితి వచ్చిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు పాలనకు కియా అద్దం పడుతోందన్నారు. సీఎం జగన్ చెప్పే మాటలు చూస్తే ఆశ్చర్యంగా ఉందని కాల్వ చెప్పారు. వినేవారు ఉంటే పెనుకొండ కూడా తన తాత కట్టించారంటారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎద్దేవా చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై పార్థసారథి, నిమ్మల కిష్టప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత, సంస్కారం లేకుండా మాధవ్ చంద్రబాబును విమర్శిస్తున్నారని.. వైకాపా నేతల వల్లే కియా లాంటి పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.
తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు
కియా పరిశ్రమ వద్దకు వచ్చిన తెదేపా మాజీ మంత్రులు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కియా పరిసరాల్లో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని, సహకరించకపోతే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ మహబూబ్ బాష అన్నారు. ఈ క్రమంలో తెదేపా నేత చిన్న వెంకటరాముడిని అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు.
ఇదీ చదవండి: