కియా పరిశ్రమలో నూతన కారును మార్కెట్లోకి విడుదల చేసే కార్యక్రమానికి అతిథిగా ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. కియా సంస్థ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే వనరులను వాడుకుని ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. పరిశ్రమకు 700 ఎకరాలకు పైగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదన్నారు. అనంతపురం జిల్లాలోని నిరుపేద రైతులు భూములను, నీటిని కియా పరిశ్రమకు ఇస్తే, పొరుగు రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. అన్ని విభాగాల్లోనూ తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణ కొరియా దేశానికి చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూములు కోల్పోయిన కుటుంబాలకు పరిశ్రమలో కాఫీ కప్పులు కడగటం.. రాళ్లు, చెత్త ఎత్తే పనులను ఇచ్చారని ఆరోపించారు. మార్కెట్ లోకి విడుదల చేసిన కియా సెల్టోస్ కారుపై అతిథులు సంతకాలు చేయాలని పరిశ్రమ యాజమాన్యం కోరగా...ఎంపీ మాధవ్ మాత్రం యువత పరిశ్రమలో లేకుండా తరమివేశారని రాసి సంతకం చేశారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా అందరినీ ఆలోచింపచేస్తోంది.
ఇదీ చదవండి...