అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ముంబయి విజయం సాధించింది. అయితే 2015 తర్వాత ఆ జట్టుపై రోహిత్‌సేన ఇప్పుడే గెలిచింది. మధ్యలో రెండేళ్ల పాటు(2016-17) రాజస్థాన్ రాయల్స్ నిషేధం ఎదుర్కొంది.
మ్యాచ్ సాగిందిలా
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో 193/4 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(35), సూర్యకుమార్(79), హార్దిక్ పాండ్య(30) ఆకట్టుకున్నారు. ఛేదనలో 136 పరుగులకే రాజస్థాన్ ఆలౌటైంది. బట్లర్(70) ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది.
ఐపీఎల్లో సూర్యకుమార్ అత్యధిక స్కోరు
ముంబయి భారీ స్కోరు చేయడంలో సూర్యకుమార్ కీలకంగా నిలిచాడు. 47 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, టోర్నీలో ఎనిమిదో అర్థ శతకాన్ని నమోదు చేశాడు. ఇదే ఇతడి అత్యధిక స్కోరు. ఇంతకు ముందు కూడా రాజస్థాన్పైనే 72 పరుగులు చేయడం విశేషం.
డెత్ ఓవర్లలో బీభత్సం
డెత్ ఓవర్లలో ముంబయి బ్యాట్స్‌మెన్ అద్భుతం చేస్తున్నారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి ఐదు ఓవర్లలో సూర్యకుమార్-హార్దిక్ కలిసి 68 పరుగులు సాధించారు. గత మూడు మ్యాచ్‌ల్లో 89/1 vs ఆర్సీబీ, 89/1 vs పంజాబ్, 61/1 vs హైదరాబాద్‌పై పరుగులు చేసింది.
లెగ్ స్పిన్‌కు మరోసారి చిక్కిన రోహిత్
ఈ మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2017 నుంచి ఇప్పటివరకు 10 సార్లు లెగ్స్పిన్నర్లకే హిట్ మ్యాన్ చిక్కడం విశేషం. రోహిత్ కంటే ముందు ధావన్(13 సార్లు) ఉన్నాడు.
బట్లర్ ఒంటరి పోరాటం
ముంబయిపై ఛేదనలో ఒంటరి పోరాటం చేసిన బట్లర్(70).. ఐపీఎల్లో పదో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వరుస సీజన్లలో ఇదే జట్టుపై మూడో అర్థశతకాన్ని సాధించాడు. 2018లో 89 పరుగులు, 2019లో 94 పరుగులు చేయడం విశేషం.
శాంసన్ మరోసారి లెఫ్టార్మ్ పేసర్కే
ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ పేసర్ బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు సంజూ శాంసన్. గత 15 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు ఎడమ చేతివాటం బౌలర్ల చేతిలోనే సంజు ఔటయ్యాడు. ముంబయి బౌలర్ మెక్లనగన్కే నాలుగుసార్లు చిక్కాడు.