చిత్రం: మహా సముద్రం; నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, జగపతిబాబు, గరుడ రామచంద్ర, శరణ్య, వైవా హర్ష తదితరులు; సంగీతం: చైతన్ భరద్వాజ్; నిర్మాత: సుంకర రామబ్రహ్మం; దర్శకత్వం: అజయ్ భూపతి; విడుదల తేదీ: 14-10-2021
కొలవలేనంత ప్రేమను.. ఆ ప్రేమకు, స్నేహానికి మధ్య జరిగిన ఆసక్తికర పోరును.. భావోద్వేగభరితంగా చూపించేందుకు 'మహాసముద్రం'తో(mahasamudram review) బాక్సాఫీస్ ముందుకొచ్చారు హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్. 'ఆర్ఎక్స్ 100'(rx 100 movie) వంటి హిట్ తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన రెండో చిత్రమిది. శక్తిమంతమైన మాస్ యాక్షన్ చిత్రంగా ముస్తాబు చేశారు. పాటలు, ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటం.. ఈ దసరా బొమ్మపై సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల్ని ఈ చిత్రం అందుకుందా? శర్వా, సిద్ధార్థ్‌లతో కలిసి అజయ్ భూపతి హిట్ మాట వినిపించారా?
కథేంటంటే: ఎదుటోడు ఒక్క చెంపపై కొడితే రెండు చెంపలు వాయించి రావాలని నమ్మే.. భగత్ సింగ్ లాంటి భావజాలమున్న కుర్రాడు అర్జున్ (శర్వానంద్). ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని జీవితంలో స్థిరపడాలన్న లక్ష్యంతో జీవిస్తుంటాడు. పైసా కోసం.. పవర్ కోసం ఎలాగైనా ఎస్ఐ అవ్వాలని కలలుగనే కుర్రాడు విజయ్ (సిద్ధార్థ్)(siddharth maha samudram). రెండు వేరు వేరు వ్యక్తిత్వాలున్న ఈ ఇద్దరినీ స్నేహం ఒక్కటి చేస్తుంది. మహా అలియాస్ మహాలక్ష్మి (అదితి రావు హైదరి)కి విజయ్ అంటే ప్రాణం. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమలో ఉంటారు. విజయ్‌ని పెళ్లి చేసుకుని త్వరగా జీవితంలో స్థిరపడాలనేది మహా కోరిక. ధనుంజయ్ (గరుడ రామచంద్ర) విశాఖ పట్టణానికి ఓ డాన్. వైజాగ్ అడ్డాగా చేసుకుని డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచి మొదలు దొంగ నోట్ల చెలామణీ వరకూ అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. ఓరోజు అనుకోని పరిస్థితుల్లో అతనికి విజయ్‌కీ మధ్య ఓ పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ధనుంజయ్ తీవ్రంగా గాయపడి మరణపు అంచుల దాకా వెళ్తాడు. దీంతో వైరి వర్గం నుంచి విజయ్ ప్రాణానికి ముప్పు వస్తుందనే ఉద్దేశంతో తనను మహాతో కలిసి మరో ఊరికి పంపించే ప్రయత్నం చేస్తాడు అర్జున్. అప్పుడే అర్జున్‌కు.. మహాకు ఓ ఊహించని షాకిస్తాడు విజయ్. దీంతో ఆ ఇద్దరి జీవితాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ధనుంజయ్‌ను చంపి అర్జున్ ఓ డాన్‌గా మారతాడు. మరి తన తమ్ముడ్ని చంపినందుకు.. అతనిపై గూని బాబ్జీ (రావు రమేశ్) ఎలా పగ తీర్చుకున్నాడు? తన సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకునేందుకు ఏం చేశాడు. అర్జున్, మహాలను వదిలి వెళ్లిన విజయ్ తిరిగొచ్చాడా? ఈ కథలో చుంచుమామ (జగపతిబాబు) పాత్రేంటి? అన్నది తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: వైజాగ్ నేపథ్యంలో సాగే ఓ సీరియస్ యాక్షన్ డ్రామా చిత్రమిది(mahasamudram review). అక్కడి మహాసముద్రం సాక్షిగా ప్రేమకు.. స్నేహానికి, పగకూ, పంతానికీ జరిగిన భావోద్వేగభరితమైన పోరాటంగా అజయ్ భూపతి ఈ కథ అల్లుకున్నాడు. ఈ బరువైన కథను నడిపించడానికి లెక్కకు మిక్కిలి బలమైన పాత్రల్ని సృష్టించుకున్నాడు. ఆ పాత్రల కోసం శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, జగపతిబాబు, రావు రమేశ్, గరుడ రామచంద్ర లాంటి దీటైన తారాగణాన్ని రంగంలోకి దించాడు. అయితే కథ అల్లికలోనే సరైన బలం లేనప్పుడు తెరపై ఎంతటి గొప్ప తారలున్నా నిరుపయోగమే అవుతుంది. ఇది మహా సముద్రంతో మరోసారి నిరూపితమైంది. అజయ్ ఈ కథతో కొలవలేనంత ప్రేమను, నిజమైన స్నేహాన్ని చూపించాలనుకున్నాడు. కానీ, తాను అనుకున్న లక్ష్యం దిశగా సరైన రీతిలో కథ సిద్ధం చేసుకోవడంలోనూ.. సమర్థంగా కథనం నడిపించడంలోనూ ఆది నుంచే తడబడ్డాడు. ఆరంభంలో శర్వా పాత్రను పరిచయం చేసిన తీరు.. అతని కోణం నుంచి కథను ఆరంభించిన విధానం ఆసక్తికరంగా అనిపించినా.. ఆ ఆసక్తిని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. తొలి 30నిమిషాలు సినిమాలోని పాత్రల్ని పరిచయం చేయడానికే సమయం తీసుకోవడం.. ఆయా పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు మరీ రొటీన్‌గా అనిపిస్తాయి.
ఇక ఇటు విజయ్, మహాల ప్రేమ కథలోనూ.. అటు అర్జున్, స్మిత (అను ఇమ్మన్యుయేల్)ల లవ్ ట్రాక్‌లోనూ ఏమాత్రం కొత్తదనం లేకపోవడం వల్ల.. రెండు ప్రేమకథల్లో దేనితోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవలేని పరిస్థితి ఉంటుంది. ధనుంజయ్‌గా రామచంద్ర పాత్రను, గూని బాబ్జీగా రావు రమేశ్, చుంచు మామగా జగపతిబాబు పాత్రల్ని పరిచయం చేసిన తీరు మెప్పించినా.. వాటిలో ఏ ఒక్క పాత్రను సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయారు. అయితే ముగింపునకు ముందు మహాను విజయ్ మోసం చేసి వెళ్లిపోవడం.. ఆమెపై పగ తీర్చుకునేందుకు వచ్చిన ధనుంజయ్‌ను అర్జున్ చంపడం వల్ల ద్వితీయార్ధంలో ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. అయితే ప్రధమార్ధంలో అంతో ఇంతో కథపై సినిమా నడిపించిన దర్శకుడు.. ద్వితీయార్ధంలో కథను పూర్తిగా గాలికొదిలేసినట్లు అనిపిస్తుంది. అర్థంపర్థం లేని ఎపిసోడ్లతో.. చిత్ర విచిత్రమైన స్క్రీన్‌ప్లేతో సినిమా ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తుంటుంది. ఓవైపు హీరో మరో నాయికతో ప్రేమలో ఉంటే., ఓ బిడ్డకు తల్లిగా ఉన్న మరో నాయిక ఆ హీరోను ఊహిస్తూ డ్యూయెట్ పాడుకోవడం ఇదెక్కడి ప్రేమరా? అనిపిస్తుంది. ఇక పతాక సన్నివేశాల్లో అర్జున్‌కు, విజయ్‌కు మధ్య నడిచే పోరు ఆసక్తిరేకెత్తిస్తుంది. అయితే విజయ్ పాత్రను, గూని బాబ్జీ పాత్రల్ని ముగించిన తీరు ఏమాత్రం మెప్పించదు. దీంతో ముగింపు చాలా పేలవంగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: అర్జున్ పాత్రలో శర్వా చక్కగా ఒదిగిపోయారు. అటు యాక్షన్ సన్నివేశాల్లో.. ఇటు ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కటి పరిణతి కనబరిచాడు. విజయ్ పాత్రలో సిద్ధార్థ్ డిఫెరెంట్ లుక్‌తో కనిపించినా.. ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఏమాత్రం ఆకట్టుకోదు. అయితే ప్రేమ సన్నివేశాల్లో శర్వా - అనుల జోడీతో పోల్చితే సిద్ధు - అదితిల జంటకే ఎక్కువ మార్కులు పడతాయి. రొమాంటిక్ సన్నివేశాల్లో ఇద్దరి కెమిస్ట్రీ మెప్పిస్తుంది. ఈ సినిమా మొత్తం మహా పాత్ర చుట్టు అల్లుకున్న కథతోనే సాగుతుంటుందని ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడు చెప్పినా.. తెరపై చూస్తున్నప్పుడు ఆ పాత్రకు అంత ప్రాధాన్యమేమీ కనిపించదు. అయితే అదితి మాత్రం మహా పాత్రకు తనవంతు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. అను ఇమ్మన్యుయేల్ పాత్ర అలా వచ్చి.. ఇలా వెళ్తుంటుందే తప్ప ఎక్కడా ప్రభావం చూపించదు. ధనుంజయ్‌గా రామచంద్ర భీకరమైన లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. గూని బాబ్జీగా రావురమేశ్ పాత్ర చిత్రణ, ఆయన విచిత్రమైన మేనరిజం ఆకట్టుకున్నా.. దర్శకుడు ఆ పాత్రను పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు. చుంచుమామగా జగపతిబాబు పలికించి హావభావాలు, ఆయన లుక్స్ ఆకట్టుకున్నాయి. ఆకట్టుకునేలా కథ.. కథనాలు రాసుకోవడంలోనూ, ఆసక్తికరమైన తీరులో స్క్రీన్‌ప్లే అల్లుకోవడంలోనూ అజయ్ భూపతి తడబడ్డాడు. చైతన్ భరద్వాజ్ తన సంగీతంతో.. రాజ్‌తోట తన ఛాయాగ్రహణంతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశారు.
బలాలు
+ శర్వానంద్, రావు రమేష్ నటన
+ ప్రధమార్ధం
+ పాటలు
బలహీనతలు
- కథ, కథనం
- ద్వితీయార్ధం
చివరగా: కల్లోల సంద్రం ఈ ‘మహా సముద్రం’(mahasamudram review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">