చిన్నారుల్లో విటమిన్ ఏ లోపాన్ని ఇప్పుడు ప్రజారోగ్య సమస్యగా పరిగణించాల్సిన అవసరం లేదని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) తేల్చి చెప్పింది. జాతీయ స్థాయి పరిశోధన సంస్థలతో కలిసి నిర్వహించిన సర్వేలో భారత్‌లో విటమిన్ ఏ లోపం 15.7 శాతమే ఉందని పేర్కొంది. శరీరంలో విటమిన్ ఏ ఎక్కువైతే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో అవసరం మేరకే ఈ డోస్‌లు ఇవ్వాల్సి ఉందని సూచించింది. ఈ మేరకు ఓ నివేదికను ఎన్‌ఐఎన్ బుధవారం విడుదల చేసింది.
నాలుగు దశాబ్దాలుగా..
1950 నుంచి 1970 వరకూ దేశంలోని చిన్నారుల్లో విటమిన్ ఏ లోపం అధికంగా ఉండడంతో రేచీకటి, అంధత్వ సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా 5 ఏళ్ల లోపు చిన్నారులకు ప్రతి ఆరు నెలలకు విటమిన్ ఏ చుక్కలమందు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్దఎత్తున ప్రారంభించింది. నాలుగు దశాబ్దాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. అంటు రోగాలకు ఇతర వ్యాక్సిన్లూ వేస్తుండటంతోపాటు పోషకాహారం తీసుకోవడం, కొన్ని ఆహార పదార్థాల్లో విటమిన్ ఏ మిళితమైన నేపథ్యంలో ఇప్పుడు విడిగా ఇవ్వాల్సినంత అవసరం లేదని అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డా.భానుప్రకాష్‌రెడ్డి చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 20 శాతం కంటే ఎక్కువమందిలో విటమిన్ ఏ లోపం ఉంటేనే దానిని ప్రజారోగ్య సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని, 5 ఏళ్లలోపు చిన్నారుల్లో పరిశీలించగా ప్రస్తుతం దేశంలో 15.7 శాతం మందిలో మాత్రమే లోపం ఉన్నట్టు తేలిందని ఎన్‌ఐఎన్ సంచాలకులు డా.హేమలత పేర్కొన్నారు. అయితే ఏడు రాష్ట్రాల్లో 20 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైందన్నారు. అందులో తెలంగాణ, మిజోరామ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కాస్త ఎక్కువ సమస్య ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: