టార్చ్ లైట్ వేసి.. పొరుగింటి వారికి చెందిన కోళ్లను చంపినందుకు ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అదేంటి కోళ్లే కదా.. చంపితే జైలు శిక్ష విధించాలా? అని అనుకుంటున్నారా? ఆ వ్యక్తి చంపినవి ఒకటి రెండు కోళ్లు కాదండోయ్. ఏకంగా 1,100 కోళ్లను చంపాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుడికి ఈ మేరకు శిక్ష విధించింది.
ఇదీ జరిగింది..
జాంగ్ అనే వ్యక్తికి తన పొరుగింట్లో ఉంటున్న 'గూ'తో 2022 నుంచి వివాదం నడుస్తోంది. అనుమతి లేకుండానే తన చెట్లను నరికివేస్తున్నాడని.. గూపై జాంగ్ ఆరోపణలు చేశాడు. దీంతో గూ.. జాంగ్ కోళ్ల ఫారమ్‌లోకి చొరబడి వాటి ముఖాలపై టార్చ్ లైట్ ఆన్ చేశాడు. దీంతో ఆ కోళ్లన్నీ భయంతో వణికిపోయి ఒక మూలకు చేరాయి. అనంతరం 460 కోళ్లు చనిపోయాయి.
ఒకే రోజు ఇన్ని కోళ్లు చనిపోయిన కారణంగా స్థానిక పోలీస్ స్టేషన్లో.. జాంగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో 'గూ'ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నష్టపరిహారం కింద జాంగ్‌కు 3000 యువాన్లు (దాదాపు రూ.35,700) చెల్లించాల్సిందిగా వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో జాంగ్‌పై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు పొరుగింటి గూ.. ఎలాగైన జాంగ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
మరోసారి కోళ్ల ఫారమ్‌లోకి చొరబడ్డాడు. ఈ సారి మరో 640 కోళ్లను భయపెట్టి చంపాడు. దీంతో అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. సెంట్రల్ చైనాలోని హునాన్ కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉద్దేశపూర్వకంగానే నిందితుడు ఈ ఘటనకు పాల్పడట్లు గుర్తించారు. ఇతరులకు ఆస్తికి నష్టం కలిగించే విధంగా గూ ప్రవర్తించినట్లు తేల్చారు. ఆరు నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కోడి వయసు ఎంతో తెలుసా?
సాధారణంగా కోళ్ల జీవితకాలం 5-10 ఏళ్లు ఉంటుంది. కానీ అమెరికాలోని ఓ కోడి పెట్ట మాత్రం 20 ఏళ్లు బతికి ప్రపంచంలోనే అత్యధిక రోజులు జీవించిన కోడిపెట్టగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. నంకిన్ మిక్స్ అనే జాతికి చెందిన ఈ కోడి పేరు పీనట్. దీన్ని మిషిగన్‌కు చెందిన మార్సీ డార్విన్ అనే లైబ్రేరియన్ పెంచింది. ఈ ముసలి కోడిపెట్ట 2002లో పుట్టింది. పీనట్ పుట్టి మార్చి 1 నాటికి 20 సంవత్సరాల 304 రోజులు అయ్యింది. ఈ కోడిన మార్సీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. మార్సీ ఓళ్లో కూర్చొని పీనట్.. టీవీ చూస్తుంది. ఆమె భూజాలపైకి ఎక్కుతుంది. మార్సీ.. పీనట్ ఆరోగ్య విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. డీ విటమిన్ టాబ్లెట్లు మెత్తగా దంచి తినిపిస్తుంది. అప్పుడప్పుడు తాజా పండ్లు, కూరగాయలు పెడుతుంది. ఎవరైనా ఎక్కువ రోజులు బతికే కోళ్లను పెంచితే.. వాటి డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతోంది మార్సీ. ఈ కోడి తన జీవిత కాలంలో పలు ప్రేమాయణాలు కూడా సాగిచింది. ఈ ముసలి కోడి గురించి మరిన్ని వివరాలు, పోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.