కరోనా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 5లక్షలకు చేరువలో ఉంది. ప్రస్తుతం 4లక్షల 88వేల 264 కేసులున్నాయి. మృతుల సంఖ్య 22వేలు దాటింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.
యూరప్ దేశాల్లో కరోనా కోరలు చాస్తోంది. ఆయా దేశాల్లో వైరస్ బాధితుల సంఖ్య 2లక్షలకు పైగా నమోదు కావడం.. అక్కడ మహమ్మారి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

24గంటల్లో 655 మరణాలు
వైరస్ కేసులు, మరణాల విషయంలో ఇటలీ, స్పెయిన్ రెండూ పోటీపడుతున్నాయి. ఆ దేశంలో 24గంటల్లో 655 మరణాలు సంభవించాయి.
ఇరాన్‌లోనూ కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అంతర్గత ప్రయాణాలను రద్దు చేసింది ఇరాన్ ప్రభుత్వం.
డబ్ల్యూహెచ్ఓ అసహనం..
కరోనా కట్టడి విషయంలో విలువైన సమయాన్ని ప్రపంచ దేశాలు వృథా చేశాయని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లక్షలాది మంది నిర్బంధంలో చిక్కుకుపోయారని, చాలా మంది నిరుద్యోగులుగా మారారని తెలిపింది. వైరస్.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. కరోనాను ప్రజా శత్రువుగా అభివర్ణించారు టెడ్రోస్. ఇప్పటికైనా ప్రపంచ నాయకులు కళ్లు తెరిచి వైరస్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సూచించారు.