Poojahegdey F3 special song remuneration: బుట్టబొమ్మ పూజాహెగ్డే పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఈ మధ్యకాలంలో 'రాధేశ్యామ్' మినహా ఆమె చేసిన ప్రతీ సినిమా దాదాపు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది! ఈ క్రమంలోనే ఆమెతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. తమ మూవీలో అలా కనిపించిన చాలు సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ ఓ ఐటెంసాంగ్ కోసం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్-వరుణ్ తేజ్ కాంబోలో రానున్న 'ఎఫ్ 3' కోసం ఆమె చిందులేయనుందని అంతా మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ సాంగ్ కోసం ఆమె తీసుకోబోతున్న రెమ్యునరేషన్ కూడా హాట్‌టాపిక్‌గా మారింది. రూ.కోటి నుంచి కోటిన్నర వరకు డిమాండ్ చేసిందట! మేకర్స్ కూడా ఓకే చేసినట్లు సమాచారం. కేవలం ఒక్క పాట కోసం ఆమె ఇంత మొత్తంలో తీసుకోవడమంటే భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి.
Poojahegdey Beast movie: 'బీస్ట్' ప్రమోషన్స్‌లో భాగంగా పూజాహెగ్డే మాట్లాడుతూ.. "ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే నాకు చెమటలు పట్టేస్తుంటాయి" అని చెప్పింది. తెలుగు, తమిళం, హిందీ తేడాల్లేకుండా.. అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో జోరు మీదున్న ఈ బుట్టబొమ్మ పాన్ ఇండియా నాయికగా అందరి మన్ననలు అందుకుంటోంది. వృత్తిపరంగా తోటి తారలు, దర్శక నిర్మాతలు మెచ్చుకుంటే ఎలా అనిస్తుందని ప్రశ్నించగా.. "వేదికలపై ఎవరైనా ఎదురుగా నుంచొని నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే కొంచెం ఒత్తిడికి గురవతా. ఎందుకంటే వాటినెలా తీసుకోవాలో నాకు తెలియదు. అదే నా సమస్య. ఆ సమయంలో నా చుట్టూ వాతావరణం వేడెక్కినట్లనిపిస్తుంది. చెమటలు పట్టేస్తాయి. కానీ, వాళ్ల మాటలు వింటున్నప్పుడు నేను సరైన దారిలో ఉన్నానన్న సంతృప్తి కలుగుతుంది. నేను నా పనిని మనస్ఫూర్తిగా నిజాయతీతో చేస్తున్నానే సంతోషం దక్కుతుంది" అని పేర్కొంది పూజా. ఆమె నటించిన 'బీస్ట్' ఏప్రిల్ 13న, 'ఆచార్య' 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇదీ చూడండి: బాప్రే.. ఈ ముద్దుగుమ్మలు అందాలతో అల్లాడిస్తున్నారుగా!