"నా తొలి సినిమాని రహదారి ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కించా. ఈ కథ కూడా ఇంచుమించు అలాంటిదే. విశాఖ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందించాం. ఆహ్లాదాన్ని పంచే ప్రేమకథతోపాటు, థ్రిల్లింగ్ అంశాలూ ఉంటాయి. మనందరి ఫోన్లలో పెట్టుబడులకి సంబంధించిన యాప్స్ ఉంటాయి.
వాటిద్వారా ఒక తప్పు జరిగితే ఏ స్థాయిలో నష్టం జరుగుతుందనేది ఊహకు కూడా అందదు. అలాంటి ఒక సమస్యని కథానాయకుడు ఓ సూపర్‌హీరోలా కాకుండా... సాధారణ యువకుడిగానే తనకున్న ప్రతిభతో ఎలా పరిష్కరించాడనేది కీలకం. దేశంలో నిత్యం జరుగుతున్న ఇలాంటి సంఘటనని ప్రేమకథకి ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది".
"ఉదయ్ శంకర్ కెరీర్‌లో ఇదొక విభిన్నమైన సినిమాగా నిలిచిపోతుంది. తను గతంలో ‘ఆటగదరా శివ’, ‘మిస్‌మ్యాచ్’ తదితర చిత్రాలు చేశారు. థ్రిల్లింగ్ ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా కూడా తన శైలికి తగ్గట్టుగానే ఉంటుంది. అమ్మాయి నచ్చిందంటే ఆమెని ప్రేమలోకి దించే యువకుడిగా కనిపిస్తాడు. ట్రాఫిక్‌లో కనిపించిన కథానాయికని ఎలా ప్రేమలోకి దించాడనేది ఇందులో ఆసక్తికరం.
ఈ పాత్రలో తన నటన కొత్తగా ఉంటుంది. కథానాయిక జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నటన అలరిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్ తదితరుల పాత్రలు కీలకం. కథని అనుకున్నట్టుగా తెరకెక్కించేందుకు నిర్మాత అట్లూరి నారాయణరావు చక్కటి సహకారం అందించారు. సిద్ధం మనోహర్ కెమెరా పనితనం, గిఫ్టన్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. ఇది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఇంటిల్లిపాదినీ అలరించే వినోదం ఇందులో ఉంది".
ఇదీ చదవండి: 'NTR 30' ప్రీప్రొడక్షన్ పనులు షురూ.. పవర్ఫుల్ క్యారెక్టర్లో విజయశాంతి!