MURDER: కుటుంబంలో ఆస్తి తగదా ఒకరి హత్యకు పురిగొల్పింది. సొంత తమ్ముడిపై అతడి సోదరులు, వదిన కలిసి గడ్డివామి వద్ద కర్రలతో దాడిచేయడంతో సింహాద్రి రవికుమార్ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం సుంకొల్లులో మంగళవారం చోటుచేసుకుంది. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానిక వైకాపా నాయకుల అండతోనే తన తండ్రిని చంపారని మృతుని కుమారుడు కార్తీక్ ఆరోపించారు. పోలీసులకు తాను వారి పేర్లు చెబుతున్నా ఫిర్యాదులో నమోదు చేయలేదని వాపోయాడు. విషయం తెలుసుకున్న తెదేపా నూజివీడు నియోజకవర్గ బాధ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చి పోలీసులను నిలదీశారు. అనంతరం మృతుడి కుమారుడు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
పోలీసులను నిలదీస్తున్న వెంకటేశ్వరరావు
నేపథ్యమిది.. పోలీసుల కథనం మేరకు.. సుంకొల్లులో ఆర్‌ఎస్ నం. 181-2లో 59 సెంట్ల మెరకభూమి ఉంది. ఇది 2016 నుంచి రవికుమార్ ఆధీనంలో ఉంది. దీనికి పాసుపుస్తకం, టైటిల్ డీడ్ కూడా వచ్చాయి. అయితే అతని సోదరులు రామకృష్ణారావు, మురళీమోహన్, వారి కుమారులు చందు, చంద్రశేఖర్, వంశీకృష్ణ, అలివేలు మంగమ్మ అనే మహిళ కలిసి సదరు భూమిని తమకు ఇచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయమై వైకాపా నాయకులు అరేపల్లి రాంబాబు, కొండలరావు నూజివీడు గ్రామీణ పోలీసు స్టేషనులో సోమవారం పంచాయితీ నిర్వహించారు. ఎస్సై ఎదుటే వైకాపా నాయకులు బెదిరించడంతో తమకు స్టేషన్‌లో న్యాయం జరగదని రవికుమార్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు. ఎంత ఖర్చయినా మిమ్మల్ని చంపేస్తానంటూ వైకాపా నాయకులు బెదిరించినట్లు రవికుమార్ కుమారుడు కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘పోలీసులు వైకాపా కండువాలు కప్పుకొని విధులు నిర్వహిస్తున్నారా’
తెదేపా సానుభూతిపరుడు రవికుమార్ హత్యపై ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే ఏకంగా వ్యక్తినే చంపేలా గ్రామ నాయకులను ప్రోత్సహించారని ఆరోపించారు. పోలీసులు వైకాపా కండువాలు కప్పుకొని విధులు నిర్వర్తిస్తున్నారని విమర్శించారు. ఈ విషయమై తాము న్యాయస్థానంలో పోరాడతామని తెలిపారు. ఈ ఘటన వెనుక స్థానిక ఎమ్మెల్యే, ఎంపీˆపీˆ భర్త తదితరులు ఉన్నారని ఆరోపించారు. పోలీసులు బాధితులు ఇచ్చిన పేర్లు తీసుకోకుండా కేసు నిలవదని మృతుడి కుమారుడితో ఖాళీ పత్రాలపై సంతకం పెట్టించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. పాసుపుస్తకాలు ఉన్నా భూమిని లాక్కునేందుకు యత్నించి, హత్య చేయించడం వైకాపా నాయకులకే చెల్లిందని తెలిపారు. ఉదయం 6 గంటలకు హత్య జరిగితే మధ్యాహ్నం రెండు గంటల వరకు కేసు నమోదు చేయలేదన్నారు. కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు యత్నిస్తున్నారన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రవికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాడుతామని ముద్దరబోయిన చెప్పారు. విషయాన్ని తెదేపా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: