TFPC on MLA Nallapu Reddy Comments: నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలను.. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఖండించింది. ఆయన వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సినిమా నిర్మాతలు బలిసినవాళ్లనడం చాలా బాధాకరమని.. వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని మిగిలిన సినిమాలు నష్టపోతున్నాయని ఓ ప్రకటనలో నిర్మాతల మండలి వివరించింది.
చిత్రసీమలో ఉన్న 24 క్రాప్ట్స్‌కు పని కల్పిస్తూ అనేక ఇబ్బందులు పడుతూ కోట్ల రూపాయలు ఖర్చు చేసి చివరకు నిర్మాతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని తెలిపింది. నష్టాల బారిన పడిన కొందరు నిర్మాతలు చలన చిత్ర నిర్మాతల మండలి నుంచి నెలకు రూ. 3 వేలు పెన్షన్ తీసుకుంటున్నారని నిర్మాతల మండలి వెల్లడించింది.
నల్లపురెడ్డి ఏమన్నారంటే..
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న నల్లపు రెడ్డి సినిమా టికెట్ల అంశంపై మాట్లాడారు. సినిమావాళ్లకు ఆంధ్రప్రదేశ్ గుర్తుందా ? అని అని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలు తగ్గిస్తే తప్పేంటని నిలదీశారు. సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించి.. సామాన్యుడు కూడా పెద్ద సినిమాలు చూసేలా.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సినిమా వాళ్లకు.. చంద్రబాబునాయుడి సపోర్ట్ ఉందని విమర్శించారు.
ఇదీ చదవండి: సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్ గుర్తుందా..?: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి