tdp leaders fires on ysrcp: సీఎం జగన్ రెడ్డి తనఖా రెడ్డిగా మారిపోయారని.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. అప్పుల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కరోనా వల్ల ఆర్దిక పరిస్థితి బాగోలేందంటూనే పేద ప్రజల్ని మభ్యపెట్టడానికి నవరత్నాల పేరుతో నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. మద్యం ధరలు, ఆస్తిపన్ను, యూజర్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై అదనంగా రూ.70 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. కరోనా సమయంలో పొరుగు రాష్ట్రాలు ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే.. జగన్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు.
వైకాపా ప్రభుత్వం 225జీవో ద్వారా రూ.5వేల కోట్ల వసూళ్లకు శ్రీకారం చుట్టిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మూడేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అప్పుల చిట్టాను గిన్నీస్ రికార్డుల్లో చేర్చాలన్నారు. ప్రజలపై కొత్త పన్నులు వేస్తూ వేధిస్తున్నారని మండిపడ్డారు.
30 ఏళ్లకు పైగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆయన విమర్శించారు. 75గజాల్లో ఉన్నవారికి రూ.6లక్షలు కోట్లు కట్టమని నోటీసులొచ్చాయని వెల్లడించారు. వైకాపాకు ఓటేసినందుకు ప్రజలు తమ చెప్పుతో తామే కొట్టుకునే పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే అడ్డదిడ్డంగా కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి తెచ్చారన్నారు. పథకం ప్రకారం తెదేపాను విమర్శించేందుకే కొడాలి నానిని ప్రయోగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
మూడు చోట్ల రాజధానులు పెడితే.. ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే