రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 2019 ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహిస్తుండటానికి.. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలని న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2021 జనవరి నాటి సవరించిన ఓటర్ల జాబితా సిద్ధం చేయనందున.. 3.60 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి.. ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని లక్ష్మీనారాయణ విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని మరో ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు ప్రకటనలు ప్రజలు, అధికారుల్ని ఉగ్రవాద వ్యూహాలతో బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఉన్నందున.. ఎన్నికలు పూర్తయ్యే వరకు వారిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: