ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ట్రేడింగ్ మిల్లుల వద్దకు తీసుకెళ్లి దిగుమతి చేయడానికి రోజుల తరబడి సమయం పడుతోంది. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల ట్రేడింగ్ మిల్లు వద్దకు ధాన్యంతో వచ్చిన ట్రాక్టర్లు, లారీలు బారులు తీరాయి. సకాలంలో సరకు దిగుమతి కాకపోవడంతో కొందరు రైతులు ట్రాక్టరు ట్రక్కులను అక్కడే ఉంచి.. ఇంజిన్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు.
మిల్లు నుంచి జాతీయ రహదారి వరకు వాహనాలు భారీగా లైన్లు కట్టాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మిల్లులో నిల్వలు ఎక్కువగా ఉండటం, వాహనాల్లోని ధాన్యాన్ని దించేందుకు కావలసిన స్థలం లేకపోవడమే ఇందుకు కారణం. చేసేది లేక మిల్లుల వద్దకు కొన్ని రోజులు ధాన్యాన్ని తీసుకురావద్దని నిర్వాహకులు చెబుతున్నారు.
రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించుకోలేక.. ఇళ్ల వద్ద నిల్వ చేసేందుకు స్థలం లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే కల్లాల్లో, ఆరుబయట ఉంచిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. నందిగామ నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి ధాన్యం విక్రయించుకోడానికి రైతులు ప్రయత్నిస్తున్నా ఫలితం శూన్యం.
ఆర్‌బీకేల వద్ద అనుమతి తీసుకుని మిల్లులు వద్దకు తీసుకెళితే ధాన్యం దిగుమతి చేసుకోడానికే రోజుల సమయం పడుతోందని రైతులు వాపోతున్నారు. చేసేది లేక.. వ్యాపారులకు వాటిని తక్కువ ధరకు విక్రయించుకుంటూ క్వింటాకు రూ. 200 వరకు నష్టపోతున్నారు. మరోపక్క కరోనా నేపథ్యంలో కూలీలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల.. కొనుగోళ్లకు మిల్లర్లు నెల రోజుల తర్వాత డబ్బు చెల్లిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. లేకుంటే తాము నష్టపోతామని నందిగామ అన్నదాతలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: