తిరుమల శ్రీవారిని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు నారాయణస్వామి. 85 శాతం రికవరీ రేటుతో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారికి వైద్యులు ఇంటికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ధైర్యం ఇచ్చేలా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు.
హత్రాస్ ఘటనపై స్పందిస్తూ మోదీ ప్రభుత్వంపై నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హత్రాస్‌లో అత్యంత పాశవికమైన సంఘటన జరింగిదని... 14 రోజులు మృత్యువుతో పోరాటం చేసి బాధితురాలు మరణించిందన్నారు. నలుగురు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు మరణ వాంగ్మూలం ఇచ్చినా... ఆ రాష్ట్ర డిజిపి అత్యాచారం జరగలేదని చెప్పారన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా బాధితురాలి మృతదేహాన్ని దహనం చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అల్పసంఖ్యాక వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీపై పోలీసులు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని నారాయణస్వామి మండిపడ్డారు. రాహుల్ ను కిందకి నెట్టేయడం ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానమేని ఆరోపనలు చేశారు. యోగి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.