ప్రశ్న : నీరు ప్రకృతిలో లభించే సహజ వనరు అనే ఇప్పటి వరకూ అందరికీ తెలుసు.. కానీ ఇది ఒక కమోడిటీగా వాల్ స్ట్రీట్ స్టాక్ ఎక్సేంజ్‌లో రిజిష్టర్ అయ్యింది. దీన్ని మనం ఎలా చూడాల్సి ఉందంటారు? ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటారు?
జవాబు : నీరు సహజ వనరుగా ఉందనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భావన. అన్నిటితో పాటు నీరు కూడా ఒక వినియోగ వనరుగా మారింది. ఇది మంచి చెడు అని కాకుండా ఒక తటస్థ వినియోగ వస్తువుగా ఎప్పుడో మారింది. దీని గురించి వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఒక ఆందోళనకరంగా కాకుండా వాస్తవిక దృక్పథంతో చూడాలి. నాస్డాక్ లో 480 డాలర్లకి ఒక ఎకరా ఘనపుటడుగుల నీటిని ఫ్యూచర్ ఎంట్రీగా నమోదు చేశారు. ఒక ఎకరా ఘనపుటడుగులు అంటే 15 లక్షల లీటర్లు.. మన గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఆ మొత్తం నీటిని అమెరికా కంటే.. ఆరింతల రేటుకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఆరొంతుల ధరతో లింగంపల్లి, కూకట్‌పల్లిలో కొంటున్నారు. దీనిని ఆందోళనకరమైన విషయంగా కాకుండా...నీటిని వృథా కానీయకుండా ఎలా అరికట్టొచ్చనే కోణంలో ఆలోచన చేయొచ్చు.
ప్రశ్న : అమెరికాలోనే కాదు చాలా దేశాల్లో అదే పరిస్థితి ఉందని మీరంటున్నారు. కానీ పదేళ్ల క్రితమే ఐక్యరాజ్య సమితి నీటిని అంతర్జాతీయ మానవహక్కుగా గుర్తించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనికి చాలా దేశాలు మద్దతివ్వగా... అమెరికా మాత్రం ఓటింగ్ కు కూడా దూరంగా ఉంది. అమెరికాలాంటి దేశమే సురక్షితమైన తాగునీరు అందించలేమని సంకోచిస్తోందా..?
జవాబు : స్టాక్ మార్కెట్‌లో రిజిస్టర్ చేయడాన్ని...నీటిని అందించడంలో విఫలమవ్వడంగా చూడటం లేదు. సమగ్రమైన నీటి యాజమాన్యానికి అది ఉపయోగపడుతుందని అక్కడి నిపుణులు భావిస్తున్నారు. ధరల హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రించడానికి ఒక సాధనంగా చూస్తున్నారు. అలాగే దీనిని చమురుతో పోల్చకూడదు. చమురును మనం భౌతికంగా తీసుకుని డబ్బులు చెల్లిస్తాం. కానీ ఇది భౌతికంగా నీటిని అందించే విధానం కాదని చెబుతున్నారు. కానీ ఇలాంటి సమస్యలు మన దేశంలో వస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టి పెట్టాలి.
ప్రశ్న : నీటిని వినియోగ వస్తువుగా మార్చడం పక్కన పెడితే...నీటి వ్యాపారం చేసే బహుళ జాతి సంస్థలు ఎన్నో స్టాక్ మార్కెట్ లో ఉన్నాయి. అయితే దానికి దీనికి తేడా ఏమిటి అసలు? దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది.
జవాబు : నీటి సీసాల కంపెనీలు ఎప్పటినుంచో ఉన్నాయి. లిస్టెడ్ బాటిల్ కంపెనీలు ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. వాళ్ల ప్రధానమైన వనరు నీరే..! కానీ నీటిని బాటిల్స్‌లో పోసి అమ్మడం, మార్కెట్లోకి తేవడంలో పెద్ద తేడా లేదు. ఫ్యూచర్ మార్కట్లో నీటిని రిజిస్టర్ చేయడం ద్వారా నీటిని నేరుగా అమ్మడం లేదు. కాలిఫోర్నియాలో భవిష్యత్‌లో రాబోయే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని... నీటి భద్రత దృష్ట్యా.. దానిని సరైన విధానంలో నిర్వహించేందుకు మార్కెట్లోకి తెచ్చారు. అది చాలా సంక్లిష్టమైన విషయం... వివరించడం కష్టం. కానీ మన దేశంలో చూడాల్సింది అది కాదు. నీటిని ఎలా వినియోగించుకుంటున్నాం అన్నది చూడాలి. ఒక కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి 3వేల నుంచి 5 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఆ 3 వేల నుంచి 5 వేల లీటర్ల నీటి ధరతో పోల్చుకుంటే... బియ్యం ధర ఎంతో మనం చూసుకోవచ్చు. ప్రతి వస్తువులోనూ నీరు ఉంటుంది.. దానికి కొంత ధర ఉంటుంది. వీటిని ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో ఎంతవరకూ భరిస్తాయన్నదే ప్రశ్న. ప్రభుత్వం నీటి పారుదలకు చేసే ఖర్చు కంటే రైతులు పండించే పంటలకు ధర చాలా తక్కువ. నీటిని అందించడానికి అయ్యే ఖర్చుకు.. వచ్చే ఉత్పత్తికి చాలా తేడా ఉంటుంది. నీరు వినియోగ వస్తువు అయితే.. ఒక వ్యవస్థీకృత విధానం వస్తుంది. అప్పుడు ఇలాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది.
ప్రశ్న: ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చాక...అది కచ్చితంగా మార్కెట్ ప్రభావానికి గురవుతుంది. నీరు కొనుగోలు చేసే వస్తువయ్యాక... నీటిని హక్కుగా పొందే రైతులకు, తాగునీటి వినియోగదారులకు దూరమవుతుందేమో అనే సందేహాలు రావడం సహజం. వీటిని ఎలా ఎదుర్కోవాలి?
జవాబు: భారత్‌లో 100 యూనిట్ల నీరు వాడుతున్నారంటే 70 యూనిట్ల వరకు వ్యవసాయానికే వెళుతుంది. 9 నుంచి 10 శాతం వరకు మాత్రమే తాగునీటిగా ఉపయోగిస్తున్నారు. వ్యావారపరమైన తాగునీటిని ప్రజలకు అందించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థ ప్రభుత్వానికి ఉంది. నీరు పొందడం అనేది మానవ హక్కుగా మన ప్రభుత్వం కూడా సంతకం చేసింది. మానవహక్కుగా గుర్తించినంత మాత్రాన నీటిని ఉచితంగా ఇవ్వడం లేదు. కానీ నీటికి డబ్బు చెల్లించినా కూడా భవిష్యత్‌లో దొరుకుతుందా లేదా అనే భయాలు రావడం సహజం. దానిని ఎదుర్కొనే వ్యవస్థీకృత విధానం అన్నది ఇక్కడ కూడా రావాలి. వస్తుందనే అనుకుంటున్నా..
ప్రశ్న; నీరు మార్కెట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతే.. దాని రూపు మారిపోతుంది. వాళ్లు కావాలనుకున్నప్పుడు డిమాండ్ సృష్టించగలుగుతుంటారు. అలాంటి పరిస్థితిని ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాల్సిన స్థానిక సంస్థలు ఎలా ఎదుర్కోవాలి..?
జవాబు : స్థానికంగా చూసుకున్నట్లయితే.. డిమాండ్ పెరిగినట్లయితే, సరఫరాలో కూడా ప్రభుత్వానికి సమస్య ఉంటుంది. నీటిని మనం పొదుపుగా, తెలివిగా వాడుకుంటున్నామా లేదా అనేదే ప్రశ్న..! అతితక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులను పొందగలిగే సాంకేతికత వచ్చింది. వాటి మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.
ప్రశ్న : బాటిళ్ల వాటర్ అంత సురక్షితం కాదని మీరు పరిశోధనలు చేసి అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతీ ఇంట్లో వాటర్ కేన్లు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఎంత వరకు సురక్షితం?
జవాబు : ముఖ్యంగా వాటర్ బాటిల్స్‌లో ఏముండాలి.. ఏముండకూడదనే మార్గదర్శకాలు మన దగ్గర లేవు. ప్రజలకు నల్లా నీటిపై నమ్మకం పోయింది. ఇప్పుడు వాళ్లలో ఆ నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి చాలా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఎలాగో నమ్మకం పోయింది కనుక కనీసం బాటిల్స్ అయినా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
ప్రశ్న: నమ్మకం సంగతి పక్కన పెడితే బాటిల్ నీళ్లు సురక్షితం కాదని చెబుతున్నప్పుడు దానిని అలాగే పంపిణీ చేయడం సరైందేనా..?
జవాబు: బాటిళ్లలో విక్రయించే నీరు ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఎన్నోసార్లు తేలింది. నీటిని టోటల్ డిజాల్వ్ డ్ లవణాలు 100 పీపీఎం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే శరీరం లవణాలను కోల్పోతుంది. దీనితో సమస్యలు వస్తాయి. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏ నీటిలో ఎంత శాతం లవణాలు ఉన్నాయన్న విషయాన్ని లేబుల్ చేయగలిగితే.. తయారీ కంపెనీలు కూడా ప్రమాణాలు పాటించడానికి ప్రయత్నిస్తాయి.
ప్రశ్న : ఇటీవల ఏలూరులో జరిగిన సంఘటనల్లో నీటిలో సీసం, నికెల్ లు కారణమని ప్రాథమికంగా నిర్థారించారు. విజయవాడలోని కృష్ణా కెనాల్ వాటర్‌లో 16 వేల రెట్ల ఆర్గాన్ క్లోరిన్ ఉందని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కుళాయి నీటిని ప్రజలు ఎలా తాగగలుగుతారు.. ?
జవాబు: కృష్ణానది కూడా పూర్తిగా కలుషితం అయింది. అది ఎందుకు ఎలా అయిందనే చర్చ ఇప్పుడు అనవసరం . ఇప్పుడు చేయాల్సిందేంటంటే.. ప్రజలు తాగడానికి వాడే నీరు సురక్షితంగా ఉండాలి. సురక్షితంగా ఉందన్న నమ్మకం ప్రజలకు కలిగించాలి. కుళాయి నీటిని మాత్రమే అందించాలన్న విషయాన్ని వదిలేసి.. బయట అందుబాటులో ఉన్న నీరైనా సురక్షితంగా ఉందన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించేలా.. దానికి లేబులింగ్ చేయాలి. అది కూడా తొందరగా ఇవ్వాలి. ఈ నమ్మకం లేకపోవడం వల్లనే ప్రజలు తమకు అందుబాటులో ఉన్న నీరు తాగి సమస్య తెచ్చుకుంటున్నారు. ఇక నుంచి జరక్కుండా చూసుకోవాలి.
ప్రశ్న : భవిష్యత్ లో నీటికి డిమాండ్ పెరుగుతుందా.. నీటి కొరత ఏర్పడనుందా? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? దీనిపై మీ అంచనా ఏమిటి?
జవాబు: మఖ్యంగా నాలుగు కారణాలను చెప్పుకోవచ్చు. అందులో మొదటిది.. వ్యవసాయం విషయంలో రైతులకు నష్టం కలగకుండా ఎన్నో రకాల టెక్నాలజీలు వచ్చాయి. తక్కువ నీటితో ఎక్కువ పంటను, అధిక ఆదాయాన్నిచ్చే పంటలను పండించే సాధకాలు ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించకుండా, డ్యాంలు వంటి వాటితో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనేలా చేస్తున్నారు. రెండోది ఎంటంటే.. వాటర్ ట్రేడబుల్ పర్మిట్స్.. ఆఫ్రికా వంటి దేశాల్లో ఎకరాకు ఇంత వాటర్‌ని కేటాయించినప్పుడు మిగిలిన నీటిని అమ్ముకునే అధికారం ఉంటుంది. దీన్నే వాటర్ ట్రేడబుల్ పర్మిట్‌గా పేర్కొంటారు. ఈ విధానం ద్వారా నీటిని కొంతవరకు ఆదా చేయవచ్చు. మూడోది ఎఫిషియన్సీ మార్కెట్ బేస్డ్. ఏ విధంగా మార్కెట్‌ని ఉపయోగించుకుంటున్నారనేది తెలుసుకోవాలి. నాలుగోది ఏంటంటే.. రైతులకు సరైన మద్దతు ధర వచ్చినట్లైతే.. తక్కువ నీటితో అయినా పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతారు. కావున నీటిని పొదుపుగా వాడడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.