తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. మినీ పురపోరు నిర్వహణపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయాన్ని అడగాల్సిన అవసరం ఏంటంది..? కరోనా నియంత్రణపై ప్రభుత్వం తీరునూ తప్పుపట్టింది.
చివరి నిమిషంలో నిర్ణయాలా?
రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగియనుందని... ఆ తర్వాత చర్యలు ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. రేపు పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇవ్వగా.. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని వ్యాఖ్యానించింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలు ఎందుకన్న ధర్మాసనం.. కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటంది. నియంత్రణ చర్యలపై తాము ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదని.. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా చెబుతామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు విన్నవించారు.
భూమి మీదనే ఉన్నారా?
రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అధికారులు ధర్మాసనం ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని ప్రశ్నించిన హైకోర్టు.. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అధికారులు భూమిపైనే ఉన్నారా..?
ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా? అసలు అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అని నిలదీసింది. కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు వివరణ అడిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ తెలుపగా.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించింది. ఎన్నికలు వాయిదా వేయడానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ప్రచార సమయాన్ని కూడా కుదించలేదని అసహనం వ్యక్తం చేసింది. ఫిబ్రవరిలోనే కరోనా రెండోదశ మొదలైనా.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ఈ ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి పురపోరు పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని హైకోర్టు అభిప్రాయపడింది.
ఇదీ చూడండి: