మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరణపై సీఎం జగన్ ఇంట్లో కుట్ర రచించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే... డ్రోన్ చిత్రీకరణ ఘటనపై హైకోర్ట్ సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిలో వీరమాచనేని కిరణ్‌కుమార్ ప్రధాన పాత్రధారి అని.. అతని ఆదేశాలతోనే చిత్రీకరణ చేసినట్లు పోలీస్ స్టేషన్ లో నిందితులు చెప్పారని అన్నారు. అయితే ఆ తరువాత మంత్రులు రంగప్రవేశం చేసి వాస్తవ విషయం మరుగునపరచారని చెప్పారు. ఇరిగేషన్ శాఖకు డ్రోన్‌తో చిత్రీకరణ చేసే అధికారం లేదని... దానికి పోలీస్‌శాఖతో పాటు సంబంధిత సంస్థ అనుమతి ఉండాలని వర్ల రామయ్య అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని భౌతికంగా దెబ్బతీసేందుకు కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ కేసును పోలీసులు పరిష్కరించలేరని, అందుకే సిటింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోతే... ఘటనపై తామే కోర్టుని ఆశ్రయిస్తామని వర్ల రామయ్య స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంట్లో లేనప్పుడు అక్కడికి మంత్రులు వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
సంబంధిత కథనాలు