చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా జరుపుకొనే పండుగ దీపావళి. పిల్లలు, పెద్దలు ఇంటిల్లిపాదీ ఏటా సంతోషంగా వేడుకలు చేసుకుంటారు. దీపావళి అంటే అందరికీ గుర్తొచ్చేది టపాసులు, మిఠాయిలు. ఆ దుకాణాల్లో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. కరోనా ధాటికి పలుచోట్ల విధించిన ఆంక్షల వల్ల మందుగుండు సామగ్రికి డిమాండ్ లేకపోయినా.. మిఠాయిలకు ఆ బాధ లేదు. వైరస్ భయంతో ఈసారి వినియోగదారులు వస్తారా.. లేదా అన్న దుకాణదారుల అనుమానాలకు తెరపడింది. బంధువులు, సిబ్బందికి మిఠాయిలను పంచి వేడుకలు నిర్వహించుకోవాలని పలువురూ ఆశిస్తుండటంతో.. దుకాణాలు జనంతో నిండాయి. నిరాశతో ఉన్న వ్యాపారుల మోముపై చిరునవ్వు వెల్లివిరిసింది. పండగకు ముందు రోజే దుకాణాల్లో వినియోగదారులు క్యూ కట్టారు.
దుకాణదారుల్లో ఆనందం:
దీపావళి కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా గిఫ్ట్ ప్యాక్‌లు తయారు చేశారు. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన మిఠాయిలకు మంచి డిమాండ్ ఉందని వ్యాపారులు చెప్తున్నారు. కొవిడ్ కారణంగా అన్ని రకాల స్వీట్స్ తయారు చేయలేకపోయామని బాధపడుతున్నారు. ఊహించని విధంగా వినియోగదారులు అధిక సంఖ్యలో రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. శానిటైజర్లను అందరికీ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. సిబ్బందికి ఇచ్చేందుకు వివిధ సంస్థలు గిఫ్ట్ ప్యాక్‌లు ఆర్డర్ చేశారని తెలిపారు. ధరలు సైతం అందరికీ అందుబాటులోనే ఉన్నాయన్నారు. గతేడాది టపాసుల రూపంలో మిఠాయిలు తయారు చేయగా.. ఇప్పడు వైరస్ భయాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు.
వినియోగదారుల ఆసక్తి:
కరోనా కారణంగా ప్రభుత్వాలు టపాసులపై ఆంక్షలు విధించడంతో.. వాటికి ప్రత్యామ్నాయంగా బంధువులకు మిఠాయిలు పంచడానికి వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. మందుగుండు సామగ్రిపై ఖర్చు చేసి అనారోగ్యాన్ని, ప్రమాదాలను కొనితెచ్చుకునే బదులు ఈ పద్ధతి బాగుందని అభిప్రాయపడుతున్నారు. వ్యాపారులు వివిధ రకాల పదార్థాలను అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా మిఠాయిలతోనే దీపావళి జరుపుకోవాలని పిల్లలకు సూచించామన్నారు.
ఇదీ చదవండి: తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్