రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.4,290 కోట్లతో రెండేళ్ల కిందట ఒక ప్రాజెక్టు రూపొందించారు. ఏఐఐబీ రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. మొత్తం వ్యయంలో 70% అంటే రూ.3003.00 కోట్లు ఏఐఐబీ భరిస్తే, రూ.1,287.00 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాలి. 2019 ఫిబ్రవరి నుంచి 2021 ఏప్రిల్ లోపు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒప్పందం. ఈ ప్రాజెక్టు కింద 250కన్నా అధిక జనాభా ఉన్న గ్రామాల నుంచి ప్రధాన రోడ్డుకు అనుసంధానమయ్యేలా రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఆ రోడ్డు రెండు కిలోమీటర్ల లోపు దూరముంటే సిమెంటుతో, అంతకన్నా ఎక్కువుంటే తారుతో నిర్మించాలనేది ప్రతిపాదన. ఇందుకోసం మొత్తం రూ.3,000 కోట్ల విలువైన పనులకు 44 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. పనులనూ ప్రారంభించారు. కొంతమేరకు పనులు జరిగినా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో గుత్తేదారులు ఇబ్బందులు పడసాగారు. ముఖ్యంగా 2020 అక్టోబరు నుంచి పనులు నెమ్మదించాయి.
మరి బ్యాంకు రుణం రాలేదా?
రుణం ఇస్తామన్న బ్యాంకు మాట తప్పిందా అంటే అదీ లేదు. ఏఐఐబీ 2019 సెప్టెంబరులో 215.19 కోట్లు, 2021 ఫిబ్రవరిలో 291.77 కోట్లు మొత్తం రూ.506.96 కోట్లు విడుదల చేసింది. దీనికి రాష్ట్ర వాటాను కలిపితే రూ.724.22 కోట్ల బిల్లులను ఇప్పటికే చెల్లించేయాలి. సంబంధిత వివరాలను ఏఐఐబీకి తెలియజేస్తే మరో విడత రూ.500 కోట్ల వరకు విడుదలయ్యే అవకాశముంది.
అధికారిక సమాచారం ప్రకారం ప్రభుత్వం ఆగస్టు వరకు రూ.408.64 కోట్ల బిల్లులను మాత్రమే చెల్లించింది. మరో రూ.315 కోట్లకు పైగా చెలించాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన నిధుల్లో కొంతమేరకు ఇతర అవసరాలకు మళ్లించినట్లు సమాచారం. కొందరు గుత్తేదారులు బిల్లుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రాజెక్టు గడువు ఇప్పటికే ముగియడంతో మరో ఏడాది పెంచారు.
ఇప్పుడు కొత్త బ్యాంకు
బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకున్న కొత్త అభివృద్ధి బ్యాంకు (ఎన్‌డీబీ) నుంచి రూ.6,400 కోట్లను రోడ్ల నిర్మాణానికి తీసుకువచ్చేందుకు అధికారులు పథకం సిద్ధం చేశారు. బ్యాంకు వాటా 70%, రాష్ట్ర వాటా 30% ఉంటుందని చెబుతున్నారు. దీనిపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.
గత నిర్ణయానికి భిన్నమైన అడుగు
విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోకూడదని ఆర్థికశాఖ గతంలోనే సూత్రప్రాయంగా నిర్ణయించింది. డాలరుతో రూపాయి మారకం విలువ మారుతుండటంతో వడ్డీ భారం బాగా పెరిగిపోతోందని, అంతకన్నా బహిరంగ మార్కెట్ రుణమే మంచిదని ఒక ఆలోచన చేసింది. అలాంటిది మళ్లీ వడ్డీ భారాన్ని ఎదుర్కొనే విదేశీ ఆర్థిక సహాయం ప్రాజెక్టు(ఈఏపీ) కింద రుణం కోసం ప్రయత్నం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
ఇదీ చదవండి: