Harish Rao Comments: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎదుగుదలను చూసి ఓర్వలేక రాజ్యసభలో అక్కసు వెళ్లగక్కారని ఆరోపించారు. వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటు చేసిన పిల్లల కొవిడ్ సంరక్షణా విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు.. హనుమకొండ మిషన్ ఆసుపత్రిలో మూడున్నర కోట్ల వ్యయంతో నిర్మించనున్న టీ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ ల్యాబ్ కు మంత్రి శంకుస్ధాపన చేశారు.
వైద్య పరీక్షల పేరుతో పేదల డబ్బుల ఖర్చు కాకూడదనే ఉద్దేశ్యంతో.. టీ డయాగ్నస్టిక్ కేంద్రం, రేడియాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రూ.1200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే 24 అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మంత్రి వివరించారు.
తెలంగాణ అమరవీరులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని.. ప్రధానిపై మంత్రి మండిపడ్డారు. 60 ఏళ్ల పోరాట ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేసిన మంత్రి.. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని స్పష్టంచేశారు. నూతన బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమి లేదని వివరించారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ 7 ఏళ్లలో చేసి చూపించారని తెలిపారు.
"పార్లమెంటులో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం ఆగ్రహంతో ఊగిపోతోంది. ఇందుకు మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానపర్చే విధంగా మాట్లాడారు. దాని అర్థం తెలంగాణ పోరాటాన్ని చిన్నచూపు చూడటమే.. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను కించపర్చటమే.. ఇప్పటికైనా భాజపా నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా ప్రధాని వ్యాఖ్యలను సమర్థించటం నిజంగా సిగ్గుచేటు. ఏ రకంగా వాటిని సమర్థిస్తారు..?" - హరీశ్‌రావు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇదీ చూడండి: