బోధనా రుసుముల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన రుసుముల్ని ఇప్పటికీ కళాశాలలకు చెల్లించని వారికి తదుపరి విడత నిలిపేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన సొమ్ముని కళాశాలలకు చెల్లించని వారికి గ్రామ సచివాలయ సిబ్బంది అక్టోబరు 27 నుంచి నవంబరు 10 మధ్య సమాచారం పంపించాలని ఆదేశించింది. సిబ్బంది సమాచారం పంపిన తర్వాత కూడా ఫీజులు చెల్లించకపోతే వారికి మూడో విడత రుసుములు అందవు. ప్రభుత్వం బోధనా రుసుముల్ని కళాశాలలకు బదులుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. వీటిని నాలుగు విడతల్లో విడుదల చేస్తుంది. మూడో విడత చెల్లింపులకు సంబంధించి అర్హుల పరిశీలన కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో కొత్త నిబంధన చేర్చింది. ప్రభుత్వం అక్టోబరు 22న నిర్వహించిన సమావేశం మేరకు ఆదేశాలిచ్చినట్లు ఉత్తర్వుల్లో వివరించింది.
నెల ముందే మూడో విడత..
బోధనా రుసుముల మూడో విడతను నవంబరు మూడో వారంలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం.. డిసెంబరులో మూడో విడత విడుదల చేయాల్సి ఉండగా.. నెల ముందే చెల్లించనుంది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి అక్టోబరు 27 నుంచి ఆరు దశల అర్హతల పరిశీలన ప్రారంభమవుతుంది. అక్టోబరు 27 నుంచి నవంబరు 10 వరకూ అర్హత పొందిన తల్లుల నుంచి వేలిముద్రలు తీసుకుంటారు. అనంతరం అర్హులు, అనర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. 10వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబరు 17న అర్హుల తుది జాబితాను ఖరారు చేస్తారు.
ఇదీ చదవండి: