వైకాపా విజయంలో ప్రవాసాంధ్రుల పాత్ర ఎంతో ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు తమపై చూపిస్తున్న ప్రేమకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. వారి దేశాభివృద్ధిలో భారతీయులు కృషి ఎంతో ఉంది అని అమెరికా అధ్యక్షుడు చెప్పిన విషయం గుర్తుచేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రత్యేకంగా తెలుగువారిని పొగడటం ఎంతో గర్వంగా ఉందన్న సీఎం... మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అన్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్ఫూర్తి దాయకమని సీఎం జగన్ పేర్కొన్నారు.
అవినీతి, లంచగొండితనం లేని రాష్ట్రమే తన కల అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. అన్నం పెడుతున్న రైతు ఆకలి బాధతో మరణించకూడదన్నసీఎం... ఏ ప్రభుత్వ పథకమైనా లంచం, విచక్షణ లేకుండా పేదవాడికి అందుబాటులోకి రావాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కాల్వల ద్వారా నీరు అందించాలన్నది తన ఆకాంక్షన్న ముఖ్యమంత్రి... పాలకులు మనసు పెడితే చేయలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు. గాంధీ జయంతి నాటికి గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తామన్న జగన్... మహిళలకు నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించామని గుర్తుచేశారు.
75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం జగన్ ప్రవాసాంధ్రులకు వివరించారు. అవినీతికి ఆస్కారం లేకుండా టెండర్ల విషయంలో న్యాయ సమీక్ష చేపట్టాలన్నారు. మంత్రివర్గంలో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు ఇచ్చామని ఉద్ఘాటించారు. కీలక మంత్రిత్వ శాఖలు బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చామన్న సీఎం... తెలంగాణతో సఖ్యతగా గోదావరిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. సముద్రంలోకి వెళ్తున్న గోదావరిని రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాలకు తీసుకొస్తామన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు. పాఠశాలలు, ఆస్పత్రుల ప్రస్తుత ఫొటోలు చూపిస్తున్నామన్న సీఎం... తర్వాత నాడు, నేడు అంటూ పాఠశాలలు, ఆస్పత్రుల ఫొటోలు చూపిస్తామని చెప్పుకొచ్చారు. అవకాశం ఉన్నా తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం 13 నెలలుగా డిస్కంలకు బిల్లులు చెల్లించలేదన్న జగన్... గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20 వేల కోట్లు బకాయిలు పడిందన్నారు. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ఉన్నాయన్న సీఎం జగన్... పల్లెలు, పట్టణాల మధ్య అంతరాలను చెరిపేసే చర్యలు చేపట్టామని వివరించారు.
సంస్కరణలు తీసుకొచ్చి పాలనలో పారదర్శకత తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి... పారదర్శకతతో రాష్ట్రంపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ప్రవాసాంధ్రులను ఏపీకి రావాలని ఆహ్వానించారు. ప్రవాసాంధ్రులు సంవత్సరానికి ఒక్కసారైనా రాష్ట్రానికి రావాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి రావాలని ఆహ్వానిస్తున్నానన్నారు. ప్రభుత్వం, ప్రవాసాంధ్రులు కలిసి గ్రామాలను బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ఒక పోర్టల్ తెరవబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పోర్టల్‌లో తెలపచ్చని వివరించారు. ప్రవాసాంధ్రులు తమతమ గ్రామాలకు సహాయం చేయాలనుకున్నా పోర్టల్‌లో చెప్పొచ్చని చెప్పారు. ఎవరు సహాయం చేస్తే... ఆ సేవకు వారి పేరే పెడతామని సీఎం జగన్ చెప్పారు.
ఇదీ చదవండీ...