ఎన్నికల విధుల్లో ప్రమాదవశాత్తు లేదా హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన ఎన్నికల సిబ్బంది కుటుంబానికి ఇచ్చే పరిహారంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసీ చేసిన సిఫార్సులను యథాతథంగా ఆమోదిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, అధికారులందరికీ సిఫార్సులను వర్తింప చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
ఈసీ సిఫార్సుల మేరకు
ఎన్నికల విధుల్లో.. రోడ్డు ప్రమాదం, గుండె నొప్పి, వడదెబ్బతోపాటు అనారోగ్యంతో మృతి చెందిన సిబ్బందికి రూ.15 లక్షలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో హింసాత్మక ఘర్షణలు, సంఘ విద్రోహశక్తుల దాడులు, తీవ్రవాదులు, నక్సల్స్ దాడులు, బాంబు పేలుళ్లు, సాయుధుల దాడుల్లో మృతి చెందిన వారికి రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలని ఈసీ సిఫార్సు చేసింది. దాడులు, ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి రూ.7.5 లక్షల పరిహారం అందజేయనున్నారు. ఉగ్రవాదులు, నక్సల్ దాడుల్లో కోల్పోతే.. ఈ పరిహారానికి రెట్టింపు వర్తింప చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కారుణ్య నియామకానికీ అవకాశం
పరిహారంతోపాటు మృతి చెందిన వారి భార్య లేదా భర్తకు సదరు ఉద్యోగి చివరిగా తీసుకున్న వేతనాన్ని పదవీ విరమణ వయసు వరకూ చెల్లించాలని నిర్ణయించారు. కారుణ్య నియామకానికీ అవకాశం కల్పించారు. అంతేకాకుండా... మృతి చెందిన ఉద్యోగి కలిగి ఉన్న అన్ని రుణాలూ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి: