ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు టీకా కనుగొనే పనిలో మన శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు క్రియా రహిత (ఇన్‌యాక్టివేటెడ్) వైరస్ టీకా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వీటితో రోగికి ముప్పు లేకపోగా పెద్ద ఎత్తున ఉత్పత్తికి అవకాశం ఉండటం వల్ల ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. రెండు నెలల్లో దీనికి ఒక రూపు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా తెలిపారు.
టీకా తయారీకి తొలుత సజీవ వైరస్‌లను అధికంగా పెంచుతారు. రసాయనాలు, వేడి చేయడం ద్వారా క్రియారహితం చేస్తారు. దీంతో వైరస్ వ్యాధి కారకం (ఫ్యాథోజెన్) చచ్చిపోతుంది. వైరస్‌లు పెరిగే సామర్థ్యం నిలిచిపోతుంది. క్రియారహిత వైరస్ టీకాను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు అది వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని రోగ నిరోధక వ్యవస్థకు అందజేస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే దాడి చేయాలని నిర్దేశిస్తుంది. దీంతో నిర్దుష్ట యాంటీబాడీలను మన రోగ నిరోధక వ్యవస్థ రూపొందించుకుంటుంది.
వైరస్ సోకినప్పుడు యాంటీబాడీలు భారీగా విడుదలై నిర్వీర్యం చేస్తాయి. వ్యాధికారకం చనిపోయినందున వైరస్ తిరగబెట్టే అవకాశమే ఉండదు. ఫలితంగా తక్కువ రోగనిరోధక శక్తి ఉండే వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇవ్వడం కూడా ఇది సురక్షితమే అంటున్నారు పరిశోధకులు. పోలియో, రేబిస్ టీకాలను ఈ పద్ధతిలోనే తయారు చేశారని డాక్టర్ రాకేశ్‌మిశ్రా గుర్తు చేశారు. తమ ప్రయోగశాలలో వైరస్‌ను పెంచడం పూర్తయిన తర్వాత టీకాల తయారీకి పరిశ్రమలకు బదలాయిస్తామని తెలిపారు.
సవాళ్లూ ఉన్నాయ్..
సహజ వాతావరణానికి వెలుపల, నియంత్రిత పరిస్థితుల్లో వైరస్‌ను వృద్ధి చేయడం సాంకేతికంగా సవాలే. క్రియాశీలకంగా ఉండే మానవ కణాల్లో వైరస్ వృద్ధి.. వెలుపల వృద్ధిలో చాలా తేడా ఉంటుందని రాకేశ్‌మిశ్రా అన్నారు. అన్ని కణాల్లో కరోనా వైరస్ వృద్ధి చెందదని.. తమ ప్రయోగశాలలోని ఆఫ్రికన్ గ్రీన్ కోతి నుంచి సేకరించిన కణాలపై అవకాశం ఉండటంతో వీటిని ఎంపిక చేశామని చెప్పారు. మనుషుల కణాలకు ఆఫ్రికన్ కోతిలోని కణాలకు పోలిక ఉండటంతో వీటిపై సెల్ వైరస్ కల్చర్ చేస్తున్నామని ఆయన వివరించారు.
ఇదీ చూడండి: భారత్‌పై 'కరోనా' ప్రతాపం.. 13వేలకు చేరువలో కేసులు