పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో శుక్రవారం దిల్లీలో రాష్ట్ర ప్రతినిధి బృందానికి సమావేశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రెండు రోజులుగా దిల్లీలోనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాజా అంచనాల ధరల ప్రకారం కేంద్రం సాయం చేయాలనే విషయంలో అక్కడ జలశక్తి, ఆర్థికశాఖ అధికారులను, మంత్రులను ఒప్పించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. కేంద్రమంత్రి షెకావత్ శుక్రవారం వీరికి సమయం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో కూడా పాల్గొంటారని సమాచారం.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో 2017-18 ధరలను బట్టి...అంచనాల సవరణ కమిటీ ఆమోదించి పంపిన ప్రకారం రూ.47,725కోట్లకు కేంద్రం ఆమోదం ఇచ్చేలా రాష్ట్ర ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. పోలవరం అథారిటీ ఆమోదించి పంపిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర జలసంఘం తరుపున అభిప్రాయాన్ని కోరింది. శుక్రవారం నాటి సమావేశంలో ఏపీ తరుపున తాజా ధరల కోసం నివేదించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావాలంటే తాజా ధరలు ఇవ్వాల్సిందేనని కూడా చెప్పనున్నారు. కేంద్ర జలసంఘం ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కొత్త మెుత్తాలను ఆమోదించినందున వారి నుంచి సిఫార్సు లభించడం పెద్ద కష్టం కాదని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: