Best education loan bank in India : నేటి కాలంలో ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. అందువల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉన్నతమైన చదువుల కోసం కచ్చితంగా బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. దేశంలోనే చదువు కొనసాగితే కొంత మేరకు సొంత సొమ్మును సర్దుకోవచ్చు. అదే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే అది తలకు మించిన భారమే. ఇలాంటి సందర్భాల్లోనే బ్యాంకు లోన్లు సామాన్యులకు వరంలా కనిపిస్తాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు సాధారణంగా తక్కువ వడ్డీకే విద్యా రుణాలు అందిస్తూ ఉంటాయి. కానీ ఈ బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడం అంత సులభమేమీ కాదు. చాలా ప్రాసెస్ ఉంటుంది. చాలా సమయం కూడా పడుతుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో విద్యారుణాలు చాలా త్వరగానే లభిస్తాయి. కానీ వడ్డీ రేట్లు మాత్రం కాస్త అధికంగానే ఉంటాయి.
ఏఏ కోర్సులకు విద్యారుణాలు లభిస్తాయి?
చాలా వరకు బ్యాంకులు దీర్ఘకాలిక ప్రొఫెషనల్ కోర్సులకు, టెక్నికల్ కోర్సులకు రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి. విద్యార్థులకు బాగా మంచి పేరున్న యూనివర్సిటీల్లో సీటు లభిస్తే, త్వరగానే లోన్ లభించే అవకాశం ఉంటుంది.
సంప్రదాయేతర కోర్సులైన ఫైన్ ఆర్ట్స్, సంగీతం లాంటి కోర్సులు తీసుకున్న వారికి, అలాగే సాంఘిక శాస్త్రాలు అభ్యసించాలని అనుకునే వారికి మాత్రం విద్యారుణాలు లభించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇలాంటి కోర్సులకు లోన్లు ఇవ్వడం చాలా అరుదు. ప్రైవేట్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇలాంటి సంప్రదాయేతర కోర్సులకు లోనులు ఇస్తాయి. కానీ అధిక వడ్డీలు వసూలు చేస్తాయి.
ఎంత మొత్తం మేర లోన్ దొరుకుతుంది?
ప్రభుత్వరంగ బ్యాంకులకు లోన్ అమౌంట్ ఎంత మేరకు ఇవ్వాలనే విషయంలో ఒక పరిమితి ఉంటుంది. కానీ ప్రైవేట్ బ్యాంకులు కాలేజ్-కోర్స్ కాంబినేషన్ చూసుకుంటాయి. అలాగే ఆ కోర్సులు చేయడం వల్ల విద్యార్థికి భవిష్యత్లో ఎంత మేరకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయో కూడా అంచనా వేస్తాయి. వాటి ఆధారంగా ఎక్కువ మొత్తంలో విద్యా రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయి.
విద్యా రుణంపై వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
Education loan interest rate : ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వడ్డీ రేటు.. రుణం తీసుకుంటున్నవారి ఆర్థిక స్థితిగతులపైన, వారి క్రెడిట్ స్కోర్పైన, కోర్స్ తీసుకున్న విద్యా సంస్థ పేరు, ప్రఖ్యాతులపైన ఆధారపడి ఉంటుంది. వీటికి తోడు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేస్తాయి.
ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
ప్రస్తుతం ఎస్బీఐ విద్యారుణాలపై 8.2 శాతం వరకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.85 శాతం వరకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.55 శాతం వరకు వసూలు చేస్తున్నాయి. ఇవి ప్రారంభ వడ్డీ రేట్లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటే ఇంకా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
విద్యారుణాలపై వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంకు 9.85 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 9.55 శాతం, యాక్సిస్ బ్యాంకు 13.7 శాతం మేరకు వసూలు చేస్తున్నాయి. కోర్స్, విద్యాసంస్థ, ఉద్యోగ అవకాశాలు మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకుని ఈ వడ్డీ రేట్లలో మార్పులు కూడా ఉండాయని రుణగ్రహీతలు గుర్తుంచుకోవాలి.
పూచీకత్తు చూపించాల్సి ఉంటుందా?
collateral requirements : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిర్దిష్ట మొత్తం కంటే అధిక మొత్తం రుణాలు పొందాలంటే పూచీకత్తు చూపించాలి. అందుకోసం మన ఆస్తులను ఆ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రైవేట్ బ్యాంకులు చాలా వరకు ఇలాంటి తాకట్టులు అడగవు. మరో విషయం ఏమిటంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద రుణం తీసుకోవాలంటే రుణగ్రహీత మార్జిన్ మనీని చూపించాలి. సాధారణంగా ప్రైవేట్ బ్యాంకులు ఈ మార్జిన్ మనీని అడగవు.
రుణాలు ఎంత కాలంలోపు తీర్చాల్సి ఉంటుంది?
ప్రభుత్వ రంగ బ్యాంకులు విద్యా రుణాలు తీర్చడానికి మారటోరియం పీరియడ్, గ్రేస్ పీరియడ్ ఇస్తుంటాయి. అంటే ఈ కాలంలో ప్రత్యేకం రుణగ్రహీత అదనపు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మారటోరియం సమయంలోనూ కొంత మేరకు లేదా పూర్తి స్థాయిలో వడ్డీని వసూలు చేస్తూ ఉంటాయి.
తీసుకున్న రుణాలు ముందుగా చెల్లించాలనుకుంటే ప్రైవేట్ బ్యాంకు అందుకు కూడా ముందస్తు చెల్లింపు రుసుమును వసూలు చేస్తాయి. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇలా ముందస్తు చెల్లింపు రుసుములు వసూలు చేయరు.
ఇవీ చదవండి: