Pawan Kalyan tweet on Mann Ki Baat programme: దేశ ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం గురించి తెలియని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. దేశంలోని మారుమూల ప్రాంతం నుంచి మహా పట్టణాల దాకా ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు రేడియోలకు, టీవీలకు అతుక్కుపోతారు. అంతేకాదు, ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'లో ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు అనే అంశాలపై ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో ఎటువంటి పనులున్నా వాటిని పక్కనబెట్టి శ్రద్ధగా వింటుంటారు. అటువంటి కార్యక్రమం 99 భాగాలు పూర్తి చేసుకుని రేపటితో 100వ భాగంలోకి అడుగుపెట్టబోతుంది.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించిన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం 100వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకోబోతున్న శుభ సందర్భంగా జనసేన పార్టీ తరపున ప్రధానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
"సేవా పరమో ధర్మః".. మనసులను హత్తుకుంటుంది.. పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం 'మోదీ 'మన్ కీ బాత్'కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు' అనే శీర్షికతో లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో..''నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తోన్న 'మన్ కీ బాత్' కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో వారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని దేశవాసులతో రేడియో మాధ్యమం ద్వారా స్వయంగా ముచ్చటించే ఈ కార్యక్రమం శ్రోతలకు, తదుపరి టీవీ ప్రసారాల్లో చూసే వీక్షకులకు ఎంతో చేరువైంది. గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే.. ఇప్పటివరకూ ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైన రేడియోలో వినడమో, టీవీలో చూడటమో జరిగింది. ప్రతి నెల 23 కోట్ల మంది ఆదరిస్తున్నారని తెలిసి సంతోషం వేసింది. 2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నాడు నిరంతరాయంగా కొనసాగుతుండటం అద్భుతమైన విషయం. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించే అంశాలు చాలా విభిన్నంగా ఉంటాయి.. సామాన్యులు సాధించే విజయాలు, గొప్ప వ్యక్తులు, కళలు, చేతివృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు... ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర చేశాయి. దానికితోడు మోదీ వాక్పటిమ, వివిధ అంశాలపై వారికున్న విశేష అనుభవం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో "సేవా పరమో ధర్మః" అని మోదీ పేర్కొనడం మనసులను హత్తుకునే విధంగా ఉంది. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కార్యక్రమ నిర్వాహకులకు నా శుభాకాంక్షలు. జైహింద్..'' అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమం.. 2014 అక్టోబర్ 3న విజయదశమి రోజున దేశ ప్రధాన నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు నుంచి నేటిదాకా ప్రతినెలా చివరి ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు రేడియోలో ప్రసంగిస్తూ వస్తున్నారు. 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి.. తన మనసులోని భావాలను, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను, ప్రముఖ వ్యక్తుల జీవితాలను, కళల నైపుణ్యం గురించి ప్రసంగిస్తున్నారు. ఇప్పటికీ 99 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న 'మన్ కీ బాత్' కార్యక్రమం రేపటీతో 100వ ఎపిసోడ్‌కు చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి