Yesvantpur to Machilipatnam Train Issues : యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నానికి వెళ్లే కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం అంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. యశ్వంతపూర్ నుంచి ఈ రైలు పుట్టపర్తికి చేరుకోగానే 3 గంటలపాటు అదే స్టేషన్‌లో నిలుపుతున్నారు. రైలులో ఉన్న ప్రయాణికులు బేజారెత్తిపోతున్నారు.
- యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం మధ్య వారానికి మూడు రోజులు నడిచే 17212 రైలు యశ్వంతపూర్‌లో మధ్యాహ్నం 1.15 గంటలకు బయలు దేరుతుంది. పుట్టపర్తికి 3.29 గంటలకు చేరుకుంటుంది. ఆ స్టేషన్‌లో 3.31 గంటలకు బయలు దేరి ధర్మవరానికి సాయంత్రం 6.05 గంటలకు చేరుకోవాలి.
- ధర్మవరం జంక్షన్‌లో తిరిగి 6.10 గంటలకు బయలుదేరాలి. అయితే 3.31 గంటలకు పుట్టపర్తిలో బయలు దేరితే రైలు 20 నిమిషాల్లోనే ధర్మవరం చేరుకుంటుంది. ధర్మవరం నుంచి ఈ రైలు సాయంత్రం 6.10 గంటలకు అనంతపురానికి బయలుదేరాల్సి ఉంది. ధర్మవరం జంక్షన్‌లో మూడు గంటలపాటు ఆపితే ప్లాట్‌ఫాం సమస్య ఉందని పుట్టపర్తిలోనే నిలుపుతున్నారు.
- పుట్టపర్తి-ధర్మవరం స్టేషన్ల మధ్య సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా 3 గంటలు సర్దుబాటు సమయాన్ని కేటాయించారు. ఇది ప్రయాణికులకు శాపంగా మారింది. ప్రయాణికులు పుట్టపర్తి స్టేషన్‌లో అంతసేపు రైలులో కూర్చోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ నడిపితేనే : యశ్వంతపూర్- మచిలీపట్నం రైలును రోజూ నడిపితేనే ప్రయాణికుల రద్దీకి ఉపశమనం లభిస్తుంది. ఈ రైలు (17212, 11) ప్రస్తుతం మంగళ, గురు, శనివారాల్లో అనంతపురం మీదుగా విజయవాడకు వెళ్తుంది. ఈ రైలు అనంతపురంలో 6.40 గంటలకు బయలుదేరి గుత్తి, డోన్, నంద్యాల మీదుగా గుంటూరుకు తెల్లవారుజామున 3.20 గంటలకు, విజయవాడకు 4.45 గంటలకు వెళ్తుంది. మచిలీపట్నానికి ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.
వాస్తవానికి అనంతపురంలో 8.30 తర్వాత బయలుదేరితే విజయవాడకు ఉదయం 6 గంటలకు చేరుకునేలా మార్పు చేస్తే బాగుంటుందని ప్రయాణికులు కోరుకుంటున్నారు. యశ్వంతపూర్‌లోనే మధ్యాహ్నం 4 గంటలకు బయలు దేరేలా చేస్తే అనుకూలంగా ఉంటుందని ప్రయాణికులు కోరుకుంటున్నారు.
'యశ్వంతపూర్ నుంచి మచిలీపట్నం రైలు వేళలను పూర్తిగా మార్పు చేయాలి. జిల్లా మీదుగా ప్రశాంతి, ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైళ్లు రోజూ నడుస్తున్నాయి. ఈ రెండు 6 గంటలకు ధర్మవరం రైలు, 6.20 గంటలకు ప్రశాంతి రైలు విజయవాడకు వెళ్తాయి. ఈ రెండు రైళ్ల వెనుక సాయంత్రం 6.40 గంటలకు కొండవీడు ఎక్స్‌ప్రెస్ రైలు వెళుతుంది. అనంతపురంలో 8.30 గంటలకు వెళ్లేలా మార్పు చేస్తే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది.' - గంగాధర్, ఉపాధ్యాయుడు