Post Office Propaganda News : బ్యాంకుల్లో ఇప్పటివరకూ పొదుపు ఖాతాలు (సేవింగ్ అకౌంట్స్) లేని వారు, ఉన్నా ఆధార్ అనుసంధానం చేయక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోలేకపోతున్న వారు సమీప తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరవాలన్న కొంతమంది అధికారుల మౌఖిక ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసులకు పోటెత్తారు. ఇప్పటికే పోస్టాఫీసుల్లో ఖాతాలుంటే జాతీయ చెల్లింపుల సంస్థ (నేషనల్ పేమేంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా)తో అనుసంధానం చేసుకోవాలన్న సూచనతోనూ కార్యాలయాలకు వెళుతున్నారు. ఈ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాలున్న వారు కూడా మళ్లీ కొత్తగా ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం.

మౌఖిక ఆదేశాలతో వ్యాపించిన దుష్ప్రచారం : గురువారం (నవంబర్ 28) ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. రాయసీమలోని కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రూ.200 చెల్లించి ఖాతా తెరిచేందుకు పిల్లా పాపలతో సహా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరీక్షించారు. ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతాలు ఉండీ, సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్న వారు మళ్లీ కొత్తగా పోస్టాఫీసుల్లో అకౌంటు తెరవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాల్సిన వారు రాష్ట్రవ్యాప్తంగా కేవలం లక్ష మంది మాత్రమే ఉంటారని అంచనా. చాలా మంది ఒకేసారి పోస్టు ఆఫీసుల వద్ద బారులు తీరడంతో గందరగోళం ఏర్పడింది.
రూ.599కే పది లక్షల బీమా : ఏడాదికి ఒకసారి అతి తక్కువ ప్రీమియంతో పోస్టల్ డిపార్ట్మెంట్ అమలు చేస్తున్న బీమా పథకం ప్రజలకు వరంగా మారింది. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తం బీమా పొందేందుకు అవకాశం ఈ పథకం ద్వారా వినియోగదారులు పొందవచ్చు. 18 నుంచి 65 ఏళ్ల వయస్సు గల వారు ఈ పథకంలో రూ. 599తో ప్రిమియం చెల్లిస్తే ప్రమాదం సంభవించినపుడు బీమాను పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టు ఆఫీసులలో ఈ సదుపాయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.