Today Ended Ashadam Sare Program in Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్ర ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఆషాఢ మాసం పురస్కరించుకొని నెలరోజులుగా దుర్గాదేవికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సారె పేరుతో రకరకాల కానుకలు అర్పించారు. జగన్మాతకు సారెను ఇవ్వడం వల్ల సౌమాంగళ్యం సిద్ధిస్తుందని, పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకం. ఇంద్రకీలాద్రిపై స్వర్ణాభరణాలతో పసిడికాంతులు వెదజల్లే కనకదుర్గమ్మను ఆడపడుచుగా భావించి పిల్లాపాపలతో సహా తరలివచ్చి భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీక్రోధి నామసంవత్సరం ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని గత నెల ఆరోతేదీ నుంచి ప్రారంభమైన ఈ పవిత్రసారె కార్యక్రమం నేటితో (ఆదివారం)తో ముగిసింది.
ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత?- సారె మహోత్సవం వెనుక కథేంటి? - Ashadam Sare
కుటుంబ సమేతంగా : ఆలయ సంప్రదాయం ప్రకారం తొలిరోజు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వైదిక కమిటీ, అర్చకులు కుటుంబ సమేతంగా అమ్మవారికి ఆషాడ పవిత్రసారెను సమర్పించారు. అలాగే నేడు(ఆదివారం) చివరి రోజున ఆలయ ఈవో రామరావు, ఆలయ సిబ్బంది, పండితులు, ఇతర విభాగాల యంత్రాంగం కుటుంబ సమేతంగా సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రాలు, చలిమిడి, పండ్లతోపాటు ఇతర సుమంగళ ద్రవ్యాలు, పదార్ధాలను తీసుకుని.. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ జమ్మిదొడ్డి నుంచి అమ్మవారికి ఆలయం వరకు ప్రదర్శనగా తరలివచ్చారు. అనంతరం అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని, సుమంగళ ద్రవ్యాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారికి సమర్పించారు.
రెండు లక్షల మందికి పైగా భక్తులు : కొన్నాళ్ల క్రితం వరకూ ఆషాడసారె సమర్పణలో భక్తులకు అవకాశం ఉండేది కాదు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల, అన్నవరం, పెనుగంచిప్రోలు తదితర ఆలయాల నుంచి మాత్రమే దుర్గమ్మకు ఆషాఢ సారె వచ్చేది. అలాగే తెలంగాణ నుంచి కూడా మహంకాళి దేవాలయాల కమిటీ తరఫున బంగారు బోనం అర్పించేవారు. అయితే 2016 నుంచి భక్తులకూ ఆషాడ సారె సమర్పణ అవకాశం కల్పించారు. దీంతో నాటి నుంచి ఆషాడమాసంలో బృందాలుగా ఏర్పడి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి సారెను సమర్పించడం మొదలుపెట్టారు. ఈసారి కూడా వివిధ ఆలయాల నుంచి ఈవోలు, ఇతర వైదిక సిబ్బంది అమ్మవారి ఆలయానికి వచ్చి సారె సమర్పించారు. ఈ ఆషాడ సారె కార్యక్రమం దుర్గా నవరాత్రుల తర్వాత అంత పెద్ద ఉత్సవంగా మారింది. సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు ఈ సారె సమర్పణలో పాల్గొన్నాట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై ఆషాడం సందడి - అమ్మవారికి సారె సమర్పణ కోసం తరలుతున్న భక్తులు - Indrakeeladri
"మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరం - అందుకే తొలుత దైవ దర్శనాలు చేస్తున్నాను"