Telangana Tunnel Collapse Update : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గంలో సహాయక చర్యలను వేగవంతం చేసి సొరంగంలో చిక్కుకున్న 8మందిని బయటకు తెచ్చేందుకు రెండు రోజుల కార్యచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. రెస్క్యూ ఆపరేషన్లకు అడ్డంకిగా నిలిచిన టన్నల్ బోరింగ్ మిషన్ అవశేషాలు, నీరు, బురద, పూడికను తొలగించి ప్రమాద స్థలానికి చేరుకోవాలని నిర్ణయించింది. సొరంగంలో చిక్కుకున్న 8మంది జాడను కనిపెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించనుంది.14 కిలోమీటర్ల సొరంగంలో 11.5 కిలోమీటర్ల వరకు ఎలాంటి అటంకాలు లేవు.
లోకో ట్రైన్‌ను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత రెండుమూడు అడుగుల వరకూ నీరు నిండి ఉంటోంది. ఇది లోకో ట్రైన్ ప్రయాణానికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వేగంగా డీవాటరింగ్ చేసి నీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తున్న అంశం టన్నల్ బోరింగ్ మిషన్ అవశేషాలు.14వ కిలోమీటర్ వద్ద పెద్ద ఎత్తున మట్టి కుప్పకూలడం, సెగ్మెంట్లు కుంగిపోవడం, వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో టన్నల్ బోరింగ్ మిషన్ వెనక భాగం అరకిలోమీటర్ వరకు కొట్టుకువచ్చింది.
సుమారు 15 అడుగుల ఎత్తులో పూడిక : టీబీఎం పూర్తిగా దెబ్బతిని దాన్ని అవశేషాలు సొరంగం నిండా నిండిపోయాయి. అక్కడి నుంచి ముందుకు సాగాలంటే పక్కనున్న పైపులు, కన్వేయర్ బెల్డ్ ఆధారంగా చేసుకుని సహాయక బృందాలు ముందుకు వెళ్తున్నాయి. అలా కాకుండా టీబీఎం వెనక భాగాన్నంతా గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో కట్ చేసి వేరు చేయాలని నిర్ణయించారు. కొట్టుకు వచ్చిన టీబీఎం తుక్కుభాగాల్లోనూ సొరంగంలో చిక్కుకున్న వారి జాడ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
టీబీఎం అవశేషాలను వెలికి తీస్తే ఇక మిగిలింది 100 మీటర్ల వరకూ పేరుకుపోయిన బురద, చివరి 40మీటర్ల ప్రాంతంలో సుమారు 15-20 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన పూడిక. ఈ పూడికను కూడా తొలగించి టీబీఎంకు చేరుకోవాలని సహాయక బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మేరకు సమగ్ర ప్రణాళిక చేసుకున్నామని, తక్షణం కార్యాచరణను ప్రారంభించనున్నట్లు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
"మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు పూర్తిస్థాయిలో డీ వాటరింగ్ చేయడం జరుగుతుంది. ఇలా డీవాటరింగ్ చేసి టన్నెల్ బోరింగ్ మిషన్‌ను గ్యాస్ కట్టర్లను ఉపయోగించి కట్ చేసి తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్ సర్వీసు వాళ్లను తీసుకొని రెస్య్కూ ఆపరేషన్ చేస్తాం. ఆ తర్వాత లోపల చిక్కుకున్న వాళ్లను బయటకు తీసుకొస్తాం. ఈ ఆపరేషన్ మొత్తం కేవలం రెండు రోజుల్లో పూర్తి చేస్తాం." - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మంత్రి
ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దు : మునుగోడు ఎమ్యెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బుధవారం SLBC టన్నెల్‌ను సందర్శించి కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరాతీశారు. 8 మందిని రక్షించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా అధికార యంత్రాంగం, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు. 24 గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, అక్కడకు రావాల్సిన అవసరం కూడా లేదని హితవు పలికారు.
రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి అవుతుందా? : గత శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగింది. ఘటన జరిగి ఆరు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సొరంగంలో చిక్కుకున్న వారికి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించినా టన్నుల బరువుండే టీబీఎం అవశేషాలు, వేల క్యూబిక్ మీటర్ల మన్నును తరలించడం శ్రమతో కూడుకున్న పని. పట్టే సమయం కూడా ఎక్కువే.
ఇక పూడికను, స్ట్ర్కాప్‌ను తరలించడానికి ఉన్న ఏకైక మార్గం లోకో ట్రైన్ మాత్రమే. కన్వేయర్ బెల్టుతోనూ శిధిలాలను నేరుగా బయటకు తరలించవచ్చు. అందుకు సంబంధించి ప్రత్యేక మరమ్మత్తులు చేపట్టి కన్వేయర్ బెల్టును తిరిగి పనిచేసేలా చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మందిని మోహరిస్తే తప్ప ఈ పని వేగం పుంజుకోనేలా లేదు. ఆ దిశగా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం - రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి