Tata Group interested in supporting Araku Coffee: అరకు కాఫీ ప్రతిష్ఠ ఇప్పటికే ఖండాంతరాలు దాటింది. తాజాగా మన్యం నుంచి తొలిసారి ఆర్గానిక్ కాఫీ పంట అందుబాటులోకి వచ్చింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో సాగు చేసి, సేకరించిన ఈ కాఫీ పంటను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. వ్యవసాయ, ఉద్యాన పంటలను ఎప్పటి నుంచో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నా కాఫీ తోటలను మాత్రం ఈ విధానంలో పెంచడం ఇదే మొదటిసారి.
10 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సమగ్ర కాఫీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా జీసీసీ ఆర్గానిక్ కాఫీ సాగును ప్రోత్సహించింది. 4 ఏళ్ల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పరిధిలో 2,600 ఎకరాల కాఫీ తోటల్లో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ (ఎన్‌పీఓపీ)కు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో గిరిజనులతో సాగు చేపట్టింది.
మైనపు బొమ్మలతో గిరిజనుల జీవన విధానం - అరకు మ్యూజియానికి పర్యటకుల క్యూ
10 వేల కిలోల కాఫీ కొనుగోలుకు ఒప్పందం: వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (అపెడా) ధ్రువీకరించిన ఏజెన్సీలతో వరుసగా మూడేళ్లపాటు ఆ పంటలను తనిఖీలు చేయించి ఈ ఏడాదికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ సాధించగలిగింది. ఇందుకోసం జీసీసీ రూ.70 లక్షల వరకు ఖర్చు చేసింది. టాటా గ్రూప్ ఇప్పటికే కాఫీ వ్యాపారంలో ఉంది. ఆ సంస్థ త్వరలో ఆర్గానిక్ కాఫీని మార్కెట్‌లోకి తేవాలని చూస్తోంది. ఈ క్రమంలో జీసీసీ అధికారులు ఆ సంస్థను సంప్రదించగా వారు ఏజెన్సీలో రైతులు పండించిన పంటను పరిశీలించి తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. తొలి విడతగా 10 వేల కిలోల కాఫీ గింజల కొనుగోలుకు జీసీసీతో ఒప్పందం చేసుకున్నారు.
విదేశాల్లో కాఫీ దిగుబడులు తగ్గడంతో దేశీయంగా మన్యం కాఫీకి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో కొనుగోలు ధరలు పెరిగాయి. వీటికి అదనంగా సేంద్రియ కాఫీకి మరింత రేటు దక్కుతుంది. సాధారణ పార్చిమెంటు కాఫీ కేజీకి రూ.400 ధర లభిస్తే ఆర్గానిక్ పార్చిమెంట్‌కు రూ.450 చొప్పున చెల్లిస్తున్నారు. చెర్రి కాఫీ కేజీ రూ.250 ధర పలికితే సేంద్రియ విధానంలో పండించిన పంటకు రూ.330 వరకు ఇస్తున్నారు. కేజీకి రూ.50 నుంచి రూ.80 వరకు తేడా ఉండడంతో మిగతా రైతులు కూడా ఆర్గానిక్ సాగుకే మొగ్గు చూపుతున్నట్లు జీసీసీ ఎండీ కల్పనాకుమారి తెలిపారు.
"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం
"కళ్ల ముందే బాహుబలి మంచుకొండలు'' - అరకు కాఫీ తాగుతూ నేరుగా ఆ అందాలను వీక్షించాల్సిందే!