Some NGOS Rescue and Strive To Better World For Stray Animals : దారిలో పోతుంటాం ఓ కుక్క కుంటుతూ పోతుంటుంది. ఓ పక్షి రెక్కవిరిగి విలవిల్లాడుతుంది. ఓ పిల్లి డబ్బాలో తలదూర్చి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతుంది. మనలో చాలామంది వాటిని చూసి ఆ క్షణం అయ్యో పాపం అనుకుంటాం. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాం. కానీ కొందరు అలా కాదు. ఆ మూగజీవాల బాధను తమదిగా భావిస్తున్నారు. రహదారి ప్రమాదాల్లో, దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ జీవాలకు చికిత్స అందిస్తూ సంరక్షిస్తున్నారు. కుక్కలు, కోతులు, ఆవులు, గాడిదలు, పాములు, పక్షులు ఇలా గాయపడ్డ మూగజీవి ఏదైనా ప్రాణాలు నిలబెడుతున్నారు. ఆ స్ఫూర్తి ప్రదాతల సేవల్లో కొన్ని ఇవి.

నెలకు రూ.7 లక్షల వరకు ఖర్చు : విజయవాడకు చెందిన రవికీర్తి ఉద్యోగాన్ని వదిలేసి జంతు సంరక్షణ చేస్తున్నారు. మణికంఠ, శివసింధూర, హారిక, మమత, సాయిమాధవిలతో కలిసి 2022లో సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విజయవాడలోని కొత్తూరు తాడేపల్లి గ్రామశివారులో ఓ స్థలాన్ని అద్దెకు తీసుకొని సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ వీధి శునకాలకు వైద్యసేవలు అందిస్తున్నారు. అవయవాలు కోల్పోయిన వాటిని కేంద్రంలోనే సాకుతున్నారు. వీటన్నింటికీ వారికి నెలకు రూ.7 లక్షల వరకు ఖర్చవుతోంది. సొంత డబ్బులు, దాతల సహకారంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 4 వేలకు పైగా కుక్కల్ని వీళ్లు కాపాడారు. బుడమేరు వరదల్లో చిక్కుకున్న 600కుపైగా కుక్కల్ని రక్షించారు. కుక్కలతో పాటు పిల్లులు, పాములు, పక్షులకూ చికిత్స చేస్తున్నారు.

గోదావరి వరదల్లో 700 ఆవులు : అది జులై 2022. గోదావరికి భారీస్థాయిలో వరదలొచ్చాయి. రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య లంకల్లో సుమారు 700 ఆవులు చిక్కుకుపోయాయి. వరద తీవ్రత దృష్ట్యా అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించలేదు. దీంతో గుంటూరుకు చెందిన జంతు ప్రేమికుడు అనుపోజు తేజోవంత్(24), రాజమహేంద్రవరానికి చెందిన నవీన్, విజయ్‌కిషోర్, గోపాల్, ధర్మేంద్ర జైన్‌ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్‌కు పట్టుబట్టారు. డ్రోన్ సాయంతో ఆవుల స్థితిగతుల్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, మత్స్యకారులు, జంతుప్రేమికులు కలిసి 3 రోజులు ఆపరేషన్ నిర్వహించి సుమారు 60 ఆవుల్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగతా వాటిని లంకల్లోనే సురక్షిత స్థలాలకు తరలించారు. కాకులు, వలస పక్షుల్ని చంపేవాళ్లు, కొండముచ్చులు, కోతుల్ని వేధించేవాళ్లపై తేజోవంత్ చట్టప్రకారం పోరాడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ జంతుసంరక్షణ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.

వైకల్యం ఉన్న కుక్కల్ని దత్తత : లాంగ్వేజ్ ట్రైనర్‌గా అమెరికాలో పనిచేసిన సికందర్ అరుణ తన సొంతూరు ఒంగోలు తిరిగొచ్చాక జంతు సంరక్షణలో నిమగ్నమయ్యారు. 2017లో తేజోవంత్‌తో కలిసి హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీని స్థాపించారు. విష్ణుజగన్నాథం, దివ్య తదితర 9 మంది సభ్యుల వీరి బృందం ఒంగోలు, గుంటూరుల్లో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. రాష్ట్రవాప్తంగా 250 మంది వాలంటీర్లతో ఓ వాట్సప్ గ్రూపునూ నిర్వహిస్తున్నారు. ఎవరైనా మూగజీవాలను హింస పెడుతున్నా, ప్రమాదంలో గాయపడ్డా సమాచారం ఉంచుతారు. వాటిని రక్షించి చికిత్స అందిస్తారు. వైకల్యం ఉన్న కుక్కల్ని జంతు ప్రేమికులు, స్నేహితులకు దత్తత ఇస్తున్నారు. కొన్నింటిని వాళ్లే పెంచుకుంటున్నారు. వధశాలల నుంచి రక్షించిన ఆవుల్ని గోశాలలకు, గాడిదల్ని కాకినాడలోని శాంక్చూరీకి పంపుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్లలో సికిందర్‌ను ఎన్నోసార్లు కుక్కలు కరిచాయి. అయినా వెనకడుగు వేయకుండా మూగజీవాల కోసం పనిచేస్తున్నారు. నెలకు రూ.20 వేల సొంత డబ్బు ఖర్చుచేస్తున్నారు. దాతల సహకారం తీసుకుంటున్నారు.

మూగజీవాల కోసం జీవకారుణ్య ఆశ్రమం : వీధి కుక్కల్ని పురపాలక సిబ్బంది క్రూరంగా చంపుతున్న ఘటన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మురాల వెంకటేశ్వర్లును జంతుప్రేమికునిగా మార్చింది. ప్రభుత్వ సహకారంతో కుక్కల కుటుంబ నియంత్రణ చికిత్సలు, శస్త్ర చికిత్సలు, వాటి మానసికస్థితి తదితర అంశాలపై శిక్షణ తీసుకున్నారు. 2002లో విజయవాడలోని భవానీపురంలో తన సొంత స్థలంలో మూగజీవాల కోసం జీవకారుణ్య ఆశ్రమాన్ని(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీవకారుణ్యం అండ్ రీసెర్చ్) ఏర్పాటు చేశారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో, ప్రమాదాల్లో గాయపడ్డ వీధి శునకాలకు ఇక్కడ ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. పూర్తిగా నయమయ్యాక వాటిని వదిలేస్తారు. కాళ్లు విరిగిన, కళ్లు కనబడని వాటిని ఆశ్రమంలోనే ఉంచుకొని సాకుతున్నారు. రోజుకు కనీసం 5 కుక్కలను జంతుప్రేమికులు చికిత్స కోసం ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఆశ్రమం నిర్వహణకు నెలకు రూ.రెండు లక్షల వరకూ ఖర్చవుతోంది. దాతల సాయంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెంకటేశ్వర్లు చెబుతున్నారు. కుక్కలతో పాటు పిల్లులు, కోతులకూ ఆయన చికిత్స చేస్తున్నారు.


ఒకే పేరుతో చాలా ఊళ్లు- అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు- 15ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు!