Scientists Discover Biopolymers From Prawn Shell : వృథాగా పడేసే రొయ్య పొట్టుకు పలు సేంద్రీయ పదార్థాలను కలిపి విత్తనాలపై పొరలుగా చేసి నాటడం ద్వారా అధిగ దిగుబడితో పాటు చీడపీడల నివారణ, భూసార సంరక్షణతో మొక్కలకు రక్షాకవచంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐవోఆర్) శాస్త్రవేత్తలు ఆర్డీ ప్రసాద్, కేఎస్‌వీ పూర్ణచంద్రికలు ఐదు సంవత్సరాల పాటు పరిశోధన చేసి మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ, ఐఐవోఆర్ డైరెక్టర్ ఆర్కే మాథుర్‌లు గురువారం రాజేంద్రనగర్‌లోని ప్రధాన కార్యాలయంలో బయో పాలిమర్‌ను ఆవిష్కరించారు.
రొయ్య పొట్టును శుద్ధి చేసి, ద్రవంగా మార్చి దానికి మొక్కలకు మేలు చేసే ట్రైకోడెర్మా, ఇతర సూక్ష్మ పోషకాలు, జీవ, సేంద్రీయ పదార్థాలను కలిపి ఆ మిశ్రమాన్ని విత్తనాలకు పొరలుగా చేయించారు. వాటిని వికారాబాద్ జిల్లాలోని గిరిజన తండాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేయించగా, మంచి ఫలితాలు వచ్చాయి. బయో పాలిమర్ ఆధారిత సీడ్ కోడింగ్ విధానానికి బయో పాలిమర్ పేరిట దరఖాస్తు చేసుకోగా, వినూత్న ఆవిష్కరణగా పేటెంట్ లభించింది.
ఎకోమెర్ పేరిట విడుదల : బయోపాలిమర్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా హైదరాబాద్‌కు చెందిన శ్రీకర్ బయోటెక్, కోల్‌కతాకు చెందిన ఎదుకా ఆగ్రోటెక్ సంస్థలతో ఐఐవోఆర్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బయోపాలిమర్‌ను ఎకోమెర్ పేరిట శుక్రవారం నుంచి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నామని శ్రీకర్ బయోటెక్ ఛైర్మన్ శ్రీనివాస రావు వెల్లడించారు.