Palnadu Sister Dhana Laxmi And Papa Shines in Several Sports : పేదరికం ప్రతిభకు పరీక్షలు మాత్రమే పెట్టగలదు కానీ, విజయాలను అడ్డుకోలేదు. అదే విషయాన్ని రుజువు చేసి చూపిస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. నిరుపేద కూలీ కుటుంబానికి చెందిన ఆ క్రీడాకుసుమాలు కఠోర సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. షూటింగ్ బాల్, ఫ్లోర్ బాల్, వాలీ బాల్, రన్నింగ్ ఇలా అనేక క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. ఇంతటి ప్రతిభ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
తినటానికి సరైన తిండి లేదు. ఉండటానికి కనీసం ఇల్లు లేదు. ఆడేందుకు అవసరమైన ఆట సామగ్రి లేదు. క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బుల్లేవు. ఉన్నదల్లా కొండంత ఆత్మవిశ్వాసం. కష్టపడే నైజం. ఇదే స్ఫూర్తితో క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. ఆర్ధిక సమస్యలు సాకు చూపి ఎంచుకున్న ఆటలో తడబడుతున్న ఈ తరానికి సవాలు విసురుతున్నారు. ఆర్ధికంగా చేయూత అందిస్తే దేశానికి మంచి పేరును తీసుకొస్తామంటున్నారు.
ప్రకృతిలో లభించే వనరులతో ఉత్పత్తులు - చిన్న ఆలోచనలతో ఆదాయం
నేటి యువతకు ఆదర్శం : పల్నాడు జిల్లా యాడ్లపాడుకు చెందిన కోడిరెక్క అన్నమ్మకు ఇద్దరు కుమార్తెలు. పేర్లు ధనలక్ష్మీ, పాప. చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. తల్లి కూలీ పనులకు వెళ్తూ కూమార్తెలను చదివిస్తూ క్రీడల్లో ప్రోత్సహిస్తుంది. జీవితంలో కష్టాలు తప్పా ఏమీ సాధించలేమని అనుకుంటున్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువ క్రీడాకారిణులు. షూటింగ్ బాల్, ఫ్లోర్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయిలో అనేక విజయాలు సాధించారు.
భర్త కుటుంబాన్ని వదిలేసినా : పాఠశాలలో చదువుతున్న సమయంలోనే లాంగ్ జంప్, రన్నింగ్ పోటీల్లో సత్తా చాటింది ధనలక్ష్మీ. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా అద్భుత ప్రతిభ చూపింది. వరుసగా 7సార్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. అక్క ప్రోత్సాహంతో ఫ్లోర్ బాల్, షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగానని చెబుతోంది పాప. 8 ఏళ్ల కిందట భర్త కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోడంతో తన ఇద్దరు కుమార్తెలను కష్టపడి చదివిస్తూ క్రీడల్లో సైతం ప్రోత్సహిస్తున్నానని చెబుతోంది తల్లి అన్నమ్మ. ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా తన కుమార్తెలకు మంచి భవిష్యత్తును అందించేలా కృషి చేస్తున్నాని చెబుతున్నారు.
"పిల్లలు ఇద్దరూ చదువుతో పాటు గేమ్స్ బాగా ఆడుతున్నారు. పెద్దమ్మాయి షూటింగ్ నేషనల్ లేవల్లో ఆడింది. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. చిన్నమ్మాయి ఫ్లోర్ బాల్ ఆడుతుంది. చాలా ఆనందంగా ఉంది. నాలాగా మా పిల్లలు కష్టపడకూడదు. వీళ్లని బాగా చదివించాలనే కోరిక ఉంది. ఇద్దర్ని గొప్పవాళ్లుగా చూడాలని ఉంది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం, దాతలు ప్రోత్సహించి సాయం చేస్తే మా పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణాలు తీసుకొస్తారనే నమ్మకం ఉంది." - అన్నమ్మ, క్రీడాకారిణుల తల్లి
ఆరు రోజులు బిజీ - వీకెండ్లో 'ట్రెక్కింగ్ కింగ్స్' అడ్వెంచర్స్