NHRC Investigate On Lagacharla Incident : తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ చేపట్టింది. స్థానిక గిరిజనులపై పోలీసులు దాడి చేశారని, అక్రమంగా అరెస్టు చేశారని ఎన్హెచ్ఆర్సీకి అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టింది.
ఇప్పటికే లగచర్ల దాడిపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఇవాళ లా విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేశ్, ఇద్దరు ఇన్స్పెక్టర్లు రోహిత్ సింగ్, ప్రకాశ్ శర్మ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాకు చేరుకుని క్షేత్ర స్థాయి దర్యాప్తు చేపట్టారు.
కలెక్టర్ లగచర్ల గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని, అధికారులపై దాడి, ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన తీరును కమిషన్ అధికారులు స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తమపై చేపట్టిన దౌర్జన్యాలను స్థానికులు వివరిస్తూ కమిషన్ ముందు వారి గోడు వెల్లబోసుకున్నారు. అర్థరాత్రి తమ ఇళ్లలోకి చొరబడి పోలీసులు తమ వాళ్లను అరెస్టు చేసి జైలుకు తరలించారని అధికారులకు తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేసి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తారో తెలియని భయం - ఇళ్లకు దూరంగా పురుషులు - ఆ గ్రామాల్లో నిర్మానుష్యం
మహిళా పోలీసులు వచ్చారా ? : పోలీసులు ఇళ్లకు వచ్చినప్పుడు మహిళా పోలీసులు ఉన్నారా ? అరెస్టు చేసిన వారిని కొట్టారా ? అనే విషయాలపై అధికారులు ఆరా తీశారు. దాడి జరిగిన రోజు పోలీసులు తమపై కూడా దాడి చేశారని, ఇంకా ఆ దెబ్బలకు నొప్పులతో బాధపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా అణగారిన వర్గాలకు చెందిన వారిమని తమకు న్యాయం చేయాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఘటన జరిగిన రోజు గాయపడిన బాధితులను ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందించాలని ఏఎన్ఎంను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా లగచర్ల ఘటనపై విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఆ వివరాలు తెలియజేయండి : మరోవైపు లగచర్ల ఘటనపై సీఎస్, డీజీపీని రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. నివేదికలో ఎఫ్‌ఐఆర్‌ల స్థితి, న్యాయ కస్టడీలో ఉన్న వ్యక్తుల వివరాలు, భయంతో అడవుల్లో దాక్కున్న గ్రామస్థుల వివరాలు ఉండాలని పేర్కొంది. గాయపడిన గ్రామస్థులకు వైద్య సహాయం అందించారా? బాధిత మహిళలకు ఏదైనా వైద్య పరీక్షలు జరిగాయా? అనే వివరాలు సైతం తెలియజేయాల్సిందిగా సూచించింది.
భారీగా మొహరించిన పోలీసులు - ఇంటర్నెట్ బంద్ - 55 మంది గ్రామస్థుల అరెస్ట్