AP Building Construction Guidelines 2025 : ఏపీలో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలక శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు ఇచ్చింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే సదరు భవనాల్లోకి అడుగు పెట్టేలా యజమానుల వద్ద ముందుగా అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించింది. భవన నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే దీనిని తీసుకోవాలని స్పష్టం చేసింది.
భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు భవన నిర్మాణ ప్రణాళికను అక్కడ ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు బిల్డింగ్ ప్లాన్ను, నిర్మాణాన్ని తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించింది. భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రం అనుసరించి నిర్మాణం లేకపోతే నివాసయోగ్య ధ్రువీకరణ పత్రం జారీ చేయకూడదని స్పష్టం చేసింది. సంబంధిత డీవియేషన్ సరి చేసేంతవరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వొద్దని ఆదేశాల్లో పేర్కొంది.
డీవియేషన్ ఉన్న నిర్మాణాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయితే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని పురపాలక శాఖ తేల్చి చెప్పింది. వాటిలో నివాస యోగ్య ధ్రువపత్రం సమర్పించిన తర్వాతే తాగునీరు, డ్రైనేజీ, కరెంట్ కనెక్షన్లకు ఇవ్వాలని స్థానిక సంస్థలకు ఆదేశాలిచ్చింది. అక్రమ నిర్మాణాల్లో ఎలాంటి ట్రేడ్ లైసెన్సులు, బిజినెస్ లైసెన్సులు జారీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా జోనల్ ప్లాన్లోను డీవియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. నివాసయోగ ధృవపత్రం చూసిన తర్వాతే బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు కూడా సదరు నిర్మాణాలపై రుణాలు మంజూరు చేయాలని సూచించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు.
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్ - భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు
15 మీటర్ల ఎత్తు వరకు స్వీయ ధ్రువీకరణ - భవన నిర్మాణాల అనుమతులు సులువు