Man Leaves Wife After Visa Cancelled in Guntur : వరకట్నం కావాలంటూ భార్యను వేధింపులకు గురిచేసి ఆమెను పుట్టింటికి పంపించిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ విదేశాలకు వెళ్లేందుకు భార్యకు వీసా రాలేదని ఓ భర్త ఆమెను పుట్టింటికి పంపిన ఘటన ఇది. దీంతో బాధితురాలు అత్తింటి ముందు నిరసనకు దిగారు. ఏపీలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరమండలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం పొన్నూరు మండలం కట్టెంపూడికి చెందిన మౌళికకు ఆరమండ వాసి మొగలాయిబాబుతో వివాహమైంది. భర్త మొగలాయిబాబు బీటెక్ పూర్తి చేయగా భార్య మౌళిక ఎంబీఏ చదివారు.
దంపతులిద్దరూ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లటానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మొగలాయిబాబు వీసా తిరస్కరణకు గురైంది. దీంతో భార్యను పంపి ఆమె ద్వారా డిపెండింగ్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లవచ్చని భర్త ఆలోచన చేశాడు. ఈ క్రమంలో భార్యతో వీసాకు దరఖాస్తు చేయించగా ఆమె కూడా అర్హత సాధించలేక పోయారు. దీంతో మూడు నెలల క్రితమే ఆమెను పుట్టింటికి పంపేశాడు. ఈ నేపథ్యంలో రోజులు గడుస్తున్నా తన భర్త నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆదివారం తన అత్తింటి ముందు మౌళిక నిరసనకు దిగారు.
న్యాయం జరిగితే చాలని : ఈ క్రమంలో మౌళికకు మద్దతుగా కుటుంబ సభ్యులు, పులువురు స్థానికులు కూడా కూర్చున్నారు. కాగా భర్త కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడికి చేరుకుని ఫిర్యాదు చేయమని కోరారు. కేసు పెట్టే ఆలోచన లేదని, తనకు న్యాయం జరిగితే చాలని మౌళిక పోలీసులకు చెప్పటంతో వారు వెనుదిరిగారు. తన అత్త ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతోందని బాధితురాలు ఆరోపించారు. సోమవారం కూడా ఆమె నిరసన కొనసాగింది.
భర్తపై విమర్శలు : కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో భర్తపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ''సిల్లీ రీజన్కే భార్యను పుట్టింట్లో వదిలేస్తారా ? భార్య వీసాపైనే ఆధారపడటం ఏంటీ బ్రో ? వీసా రాకపోతే వైఫ్‌తో లైఫ్ వద్దా ఏంటీ ? '' అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తూ భర్త మొగలాయిబాబుపై మండిపడుతున్నారు.
అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు - న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు భార్య ధర్నా
కోడల్ని వేధించిన అత్తమామలు.. బుల్డోజర్‌తో పోలీసుల ఎంట్రీ.. చివరకు