Chitti Trading Fraud : చాలా మంది చిరుద్యోగులు పైసా పైసా కూడబెట్టి చిట్టీలు కడుతుంటారు. అలా కట్టిన డబ్బులతో వారు ఇంటి అవసరాలను తీర్చుకుంటుంటారు. ఇలా చిట్టీలు కట్టిన సభ్యులను నిండా ముంచి ఓ నిర్వాహకుడు పరారయ్యాడు. ఏకంగా రూ.100 కోట్లకు పైగా సొమ్ము చెల్లించకుండా ఉడాయించాడు. బాధితులు అతడి ఇంటి వద్దకు వెళ్లి లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
బాధితులు తెలిపిన కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూ లక్ష్మి దంపతులు 18 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరు బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ సమీపాన సీ-టైపు కాలనీలో నివాసం ఉంటున్నారు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలు అడ్డా కూలీగా పని చేశాడు. ఆ తర్వాత స్థానికులతో పరిచయాలు పెంచుకొని కూలీ పని మానేశాడు. కూలీ పని మానేసి 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారాన్ని చేస్తున్నాడు.
రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలను పుల్లయ్య నిర్వహించేవాడు. తొలుత గుడిసెల్లో నివాసం ఉన్న అతడు కొద్దికాలంలోనే కోటీశ్వరుడిగా ఎదిగిపోయాడు. పెద్ద భవంతి కట్టి, చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశచూపి తన వద్దే ఉంచుకునేవాడు. మళ్లీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడు. ఇలా దాదాపు తెలిసిన వారి వద్ద వడ్డీకి రూ.కోట్లు అప్పుగా తెచ్చి విలాస జీవితాన్ని గడిపాడు. సుమారు 2 వేల మంది చందాదారులు ఇతడి వద్ద చిట్టీలు వేశారు.
కుటుంబ సభ్యులతో పరారీ : చిట్టీలు కట్టిన వారు డబ్బులు అడగటంతో పుల్లయ్య ఈ నెల 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇలా చెప్పి ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. వారు తమ సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. బుధవారం మధ్యాహ్నం వరకు దాదాపు 700 మందికి పైగా బాధితులు అతడి నివాసం వద్దకు చేరుకున్నారు. అనంతరం వారంతా తమ గోడును ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. కొందరు మహిళలైతే కన్నీరు పెట్టుకున్నారు. బాధితుల లెక్క ప్రకారం రూ.100 కోట్లకు పైగా చెల్లించకుండా పుల్లయ్య ఉడాయించాడని తెలిపారు.
ఇంట్లో 5 డబ్బు లెక్కింపు యంత్రాలు : ఇంకా చాలా మంది పుల్లయ్య బాధితులు ఉన్నారు. దీంతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పుల్లయ్య ఇంట్లో నగదు లెక్కించడానికే ఐదు యంత్రాలు ఉండేవని బాధితులు తెలిపారు. చిట్టీల వ్యవహారంపై ఎస్సార్‌నగర్ పోలీసులు స్పందిస్తూ బుధవారం సాయంత్రం వరకు బాధితులెవరూ తమకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ మోసం - రూ.850 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
లక్ష డిపాజిట్‌పై నెలకు రూ.20వేల వడ్డీ - ఇలా నమ్మించి 270 కోట్లు దోచేశారు!