Lifeguards Saved Drowning Person in Vishaka RK Beach : విశాఖ ఆర్కే బీచ్లో సముద్రస్నానం చేసేందుకు వచ్చి నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని లైఫ్ గార్డ్ లు కాపాడారు. రాసపువానిపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు శివరాత్రి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చారు. స్నానం చేస్తుండగా సముద్రపు అలలు నూకరాజును సముద్రంలోకి లాక్కెళ్లాయి. స్పందించిన లైఫ్ గార్డ్ లు వెంటనే సముద్రంలోకి పడవలతో వెళ్లి బాధితుడిని కాపాడి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం నూకరాజు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది.
కిక్కిరిసిన తీరాలు : మహాశివరాత్రి అమావాస్యను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని పలు తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాజయ్యపేట, బోయపాడు, దొండవాక గ్రామాల్లోని సముద్ర తీరాలకు ఈరోజు(గురువారం) ఉదయం నుంచి భక్తులు వేలాదిగా స్నానాల నిమిత్తం తరలివచ్చారు. దీంతో అక్కడి తీరాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.