Increasing Thefts at Nizamabad Railway Station : నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి. వీటిని అరికట్టేందుకు రైల్వే పోలీసులు కృషి చేస్తున్నారు. అయినా నిందితులు ఎక్కడో చోట చోరీకి పాల్పడుతూనే ఉన్నారు. నెలకు సగటు 6 చొప్పున చోరీలు జరుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు 78 ఘటనలు జరిగాయి. ప్రయాణికులు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న దొంగలకు అవకాశం ఇచ్చినట్లే. చాలా వరకు ప్రయాణికుల నిర్లక్ష్యం వల్లే చోరీలు జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- కుటుంబ సమేతంగా వెళ్లేటప్పుడు బ్యాగుల బాధ్యత ఒక్కరే తీసుకోవాలి.
- విలువైన వస్తువులను సాధ్యమైనంత వరకు ఇంటి వద్దే ఉంచాలి.
- అనుమానితులు తరచూ తిరుగుతుంటే అప్రమత్తంగా ఉండాలి.
- గుర్తు తెలియని వ్యక్తులకు తమ బ్యాగులను చూడమని చెప్పుకూడదు.
- ప్రయాణంలో కానీ రైల్వే స్టేషన్లో ఎవరైనా తెలియని వ్యక్తులు తినుబండారాలు ఇస్తే తీసుకోవద్దు.
- కిటికీ వద్ద మహిళలు కూర్చుంటే బంగారు ఆభరణాలు కనిపించకుండా మెడచుట్టూ కొంగు, చున్నీ కప్పుకోవాలి.
హైదరాబాద్ నగరానికి చెందిన రేణుక ఈ నెల 16న బాసరకు వచ్చారు. జ్ఞాన సరస్వతిని దర్శించుకుని అదే రోజు ఇంటర్ సిటీ రైల్లో తిరుగు ప్రయాణమయ్యారు. క్రాసింగ్ ఉండటంతో జానకంపేట రైల్వే స్టేషన్లో రైలు ఆగింది. ఓ దుండగుడు వచ్చి కిటికీ పక్కన కూర్చున్న ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. తేరుకున్న ఆమె నిజామాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పడుకున్నాక సెల్ఫోన్ చోరీ : ఈ నెల 14న హైదరాబాద్‌కు చెందిన మహేశ్ ఓ పనిపై నిజామాబాద్ వచ్చారు. పనిపూర్తి చేసుకొని ఈ నెల 15న తిరిగి వెళ్లేందుకు రైల్వే ప్లాట్‌ఫాం పక్కన గద్దెపై రైలు రాకకోసం ఎదురుచూస్తున్నాడు. అలసిపోయి ఉన్న ఆయన నిద్రలోకి జారిపోయాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయన జేబులోని సెల్ఫోన్, రూ.45 వేల నగదు ఎత్తుకెళ్లాడు. బాధితుడు లబోదిబోమంటూ నిజామాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారించగా నిందితుడు నవీపేటకు చెందిన వినయ్ కుమార్(31)గా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సొత్తు రికవరీ చేశారు.
ఎవరైనా అనుమానితులు కనిపిస్తే కాల్ చేయండి : ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. అనుమానితులు కనిపిస్తే పట్టుకొని విచారిస్తున్ననట్లు చెప్పారు. రైళ్లలో ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే 8712658591 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే వారికి అలర్ట్ - ఆ ప్రాంతం గుండా వెళితే కాస్త జాగ్రత్త!
జాతీయ రహదారిపై టాక్స్ అధికారులమంటూ దోపిడీలు - వాహనదారులు, ప్రజలు జరభద్రం
పక్కన చేరి, ఘరానా చోరీ - హైదరాబాద్లో దోపిడీ ముఠాల హల్చల్ - THEFT GANGS IN HYDERABAD